
రైల్వే స్టేషన్ వద్ద గుంపులుగా వలస కూలీలు
శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలు... బొబ్బిలి రైల్వే స్టేషన్... మూటాముల్లే సర్దుకుని స్టేషన్‌కు పిల్లలతో పరుగులు పెడుతున్న ప్రయాణికులు... ఇంత పెద్ద సంఖ్యలో తరలిరావడాన్ని చూసిన స్థానికులు అవాక్కయ్యారు. నిత్యం ఇక్కడినుంచి విజయవాడ పాసింజర్ రైలుకు పెద్ద సంఖ్యలో జనం తరలివెళ్లడం అందరికీ తెలిసిందే. కానీ ఇంత పెద్ద సంఖ్యలో తరలిరావడం చూసి అంతా నోరెళ్లబెట్టారు. వారంతా బతుకు తెరువుకోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే వలస కూలీలే.
విజయనగరం, బొబ్బిలి: పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి, రామభద్రపురం, బలిజిపేట, బాడంగి, తెర్లాం మండలాలకు చెందిన సుమారు రెండువేల మంది వలస కూలీలు శుక్రవారం ఒక్కరోజే బొబ్బిలినుంచి పయనమయ్యారు. వీరంతా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగే అపరాల తీతలు, రబీ వ్యవసాయ పనుల కోసం జట్లుగా వెళ్తున్నారు. ఇక్కడ పనులు చేస్తే మహిళా కూలీలకు కేవలం రూ.100లు పురుషులకు రూ.250లు మాత్రమే ఇస్తున్నారని, ఆ జిల్లాల్లో అయితే పెద్ద మొత్తంలో కూలి వస్తోందని అక్కడకు తరలి వెళ్తున్నారు. శుక్రవారం వీరంతా బొబ్బిలి రైల్వే స్టేషన్‌కు చేరుకుని రాయఘడ–విజయవాడ ప్యాసింజర్ రైలును ఆశ్రయించారు.
అయితే సుమారు 500కు పైగా జనం రైలెక్కలేకపోయారు. వారంతా బస్సులు, లారీలను ఆశ్రయించారు. 10 నుంచి 30 మంది జట్లుగా వెళ్తున్నవారంతా కలసి కట్టుగా అటువైపు వెళ్తున్న లారీలను మాట్లాడుకుని వెళ్లిపోగా మరికొంత మంది టాటా ఏస్‌లతో విజయనగరం వరకూ మాట్లాడుకుని అక్కడి నుంచి మరో రైలు పట్టుకుని వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. మరి కొందరు అంత దూరం బస్సుల్లో వెళ్లేందుకు చార్జీలు లేక మరునాటి వరకూ ఉండేందుకు బొబ్బిలిలోనే ఉండిపోయారు.
వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బస
రైలెక్కలేకపోయిన జనమంతా రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఉండిపోయారు. విశాలంగా కార్యాలయం షెడ్ ఉండటంతో అక్కడే రాత్రి ఉండి మరునాడు మరో రైలెక్కివెళ్లేందుకు నిర్ణయించుకున్నారు.
మా తమ్ముడు తీసుకురమ్మన్నాడని...
ఇక్కడ కన్నా అక్కడెక్కువ పనులు, కూలీ ఉంటుంది. అక్కడ మా తమ్ముడు భీమ పనిచేస్తున్నాడు. ఎంత మందినైనా తీసుకురమ్మంటే ప్రస్తుతం 20 మందిని తీసుకువెళ్తున్నాను. వీరందరినీ తీసుకెళ్లి అక్కడ పనిలో కుదురుస్తాం. ఇక్కడి కంటే అక్కడ ఒక్కొక్కరికీ రూ.200 నుంచి 250లు కూలీ అదనంగా లభిస్తుంది. – పత్తికాయల గౌరి,జట్టు మేస్త్రి సోదరుడు, రామభద్రపురం
ఇక్కడ కనీస వేతనానికి గ్యారంటీ లేదు
ఉపాధి పనులు చేస్తున్నా కనీస వేతనం వస్తుందన్న గ్యారంటీ లేదు. మహా అయితే వంద రూపాయలు రావడం కష్టం. అక్కడికెళ్తే రూ.300కు పైగా ఒకరికి వస్తున్నాయి. ముందుగా మాట తీసుకుని కూలీల జట్టు మేస్త్రీతో వెళ్తున్నాం. పనులు చేసుకుని నాలుగు కాసులు వెనకేసుకుని వస్తాం. – నందిబిల్లి బంగారమ్మ, నాయుడు వలస,రామభద్రపురం మండలం
మినప చేలు తీసేపనికోసం..
మినప చేలు తీసే పనులు అక్క డ ఎక్కువగా దొరుకుతాయి. ఆ పనులతో పాటు రబీ పంటలకు సంబంధించి పనులు ఉంటా యి. ఇక్కడ పనులకు అంతగా గిట్టుబాటు అవదు. అందుకే కుటుంబంతో కలసి వెళ్తున్నా .– యడ్లమారి నాయుడు, పారాది, బొబ్బిలి మండలం
Comments
Please login to add a commentAdd a comment