లక్షల గళాల సమైక్య నినాదం | Millions of people's voice | Sakshi
Sakshi News home page

లక్షల గళాల సమైక్య నినాదం

Published Thu, Sep 5 2013 9:28 PM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM

లక్షల గళాల సమైక్య నినాదం

లక్షల గళాల సమైక్య నినాదం

అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించాలన్న ప్రతిపాదనకు సీమాంధ్ర ప్రజలు భగ్గుమంటున్నారు. సమైక్యాంధ్ర కోసం ఈరోజు సీమాంధ్రలో లక్షల గళాలు నినదించాయి.  ఉద్యమాలతో  సీమాంధ్ర హోరెత్తుతోంది. ఆడా-మగా తేడా లేదు. పేదాధనిక భేదం లేదు. కులమతాలకు తావు లేదు. రాజకీయ పార్టీలతో సంబంధంలేకుడా జనం జనం చేయి చేయి, గళం గళం కలిపారు. ఊరూ వాడ ఏకమయ్యారు.  సీమాంధ్ర సమరాంధ్రగా మారింది. పల్లెలు సింహగర్జన చేస్తుంటే, పట్టణాలు లక్ష గళాలతో గర్జిస్తున్నాయి.  సమైక్యత అనే ఒకే ఒక్క లక్ష్యం అందరినీ ఒక్కటి చేసింది.  సమైక్యాంధ్ర నినాదం ఢిల్లీ వరకు  వినిపించేలా పొలికేక పెట్టారు. ఉద్యమం మహోద్యమం అయ్యింది. లక్షలాది గొంతులు   సమైక్యాంధ్ర సాధించి తీరుతామని నినదించాయి.  సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా జనం పోరాట పథంలో కదం తొక్కుతున్నారు. ఏడుచోట్ల లక్షల మంది ప్రజలు - రోడ్లమీదకు వచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ డిమాండ్‌ చేశారు. తూర్పుగోదారి జిల్లా కాకినాడలో లక్ష జనగళ సారఘోష పేరుతో, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, కృష్ణాజిల్లా చల్లపల్లి, గుంటూరు జిల్లా తెనాలి, నెల్లూరు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో లక్ష గళఘోష, కడప జిల్లా ప్రొద్దుటూరులో పొలికేక పేరుతో లక్షలగళాలు నినదించాయి. ఈ కార్యక్రమాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు, న్యాయవాదులు..... ఇలా ప్రతి వర్గానికి చెందిన వారు ల్గొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో లక్షగళ సమైక్యాశంకారావం నిర్వహించారు. విద్యార్థి, ఉద్యోగ, ప్రజాసంఘాల నేతలతో పాటు అత్యధిక సంఖ్యలో  ప్రజలు పాల్గొని సమైక్యస్వరం వినిపించారు. వైఎస్సార్‌ సీపీ నేత ఆళ్లనాని తదితరులు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర విభజనను సహించేది లేదంటూ ఏలూరువాసులు కదం తొక్కుతున్నారు. కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోంది. కాకినాడలో లక్ష గళ సమైక్య సాగర ఘోష నిర్వహించారు.  కాకినాడ జనసంద్రమైంది. ఇసుకేస్తే రాలనంతమందితో సమైక్య నినాదాన్ని వినిపించింది.  సర్వమత ప్రార్థనలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో టీచర్లు కూడా భాగస్వామ్యం కావడంతో రోడ్డుపైనే టీచర్స్ డే జరుపుకున్నారు. విద్యార్థులు గురువుల ఆశీర్వాదం తీసుకొని సమైక్య స్వరం వినిపించారు.  ఎండను సైతం లెక్కచేయక పిల్లలు, వృద్ధులు, వికలాంగులు సైతం ఈ సాగర ఘోషలో పాలుపంచుకున్నారు

కడప జిల్లాలో ఉద్యమ కెరటాలు ఎగసిపడుతున్నాయి. పొద్దుటురులో పొలికేక విజయవంతమైంది. సుమారు లక్ష మంది పొలికేకలో పాల్గొని సమైక్య నినాదాలు చేశారు. యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఎక్కడ ఉన్నా తమ పొలికేక వినపడుతుందని మహిళలు చెప్పారు.  ప్రొద్దుటూరు పొలికేక పెట్టింది. ఢిల్లీకి వినిపించేలా నినదించింది. సమైక్యాంధ్రకు మద్దతుగా లక్షమందితో భారీ నిరసన  ప్రదర్శన చేపట్టింది.

రాష్ట్ర విభజనపై సింహపురివాసులు  సింహాల్లా గర్జించారు. తెలుగుజాతిని చీల్చొద్దంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని.. సమైక్యాంధ్ర లక్ష గళ సింహగర్జనను నిర్వహించారు. విభజనపై తమ నిరసన వ్యక్తం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం దద్దరిల్లింది. లక్ష గళ సింహగర్జన కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజయ్యారు.

అనంతపురం జిల్లా  తాడిపత్రి  సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తింది.  లక్షల మంది జై సమైక్యాంధ్రా అంటూ గర్జించారు.  ప్రాణాలు అర్పించైనా సమైక్యాంధ్రాను కాపాడుకుంటామని  గర్జించారు. ఈ లక్షగళార్చనకు అన్నివర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. లక్షల మంది రోడ్డు మీదకు వచ్చి సమైక్యాంధ్ర అంటూ నినదించడంతో  తాడిపత్రి  దద్దరిల్లింది.  తాడిపత్రి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద లక్ష గళ ఘోష నిర్వహించారు.  తాడిపత్రికి చుట్టూ ఉన్న పలు  గ్రామాల నుంచి ర్యాలీలుగా జనం తరలివచ్చారు. వారి సమైక్యాంధ్ర  నినాదాలతో దిక్కులు పెక్కటిల్లాయి.

 కృష్ణా జిల్లా చల్లపల్లిలో నిర్వహించిన లక్ష గళ ఘోషకు  ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.  దిక్కులు పెక్కటిల్లేలా సమైక్యవాదం వినిపించి ఉద్యమ సత్తాను చాటారు.   చల్లపల్లి   సమైక్య నినాదాలు మార్మోగాయి. తెలుగు తల్లిని ముక్కలు చేయవద్దంటూ సమైక్యవాదులు గొంతెత్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మేధావులు, సామాన్య ప్రజలు  అందరూ ఒక్కటయ్యారు. సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా చాటిచెప్పారు.   

గుంటూరు జిల్లా తెనాలిలో లక్షగళార్చన నిర్వహించారు. విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.  తెలుగుతల్లిని ముక్కలు చేయాలని ఎవరు ప్రయత్నాలు చేసినా మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.  లక్షల మంది జనం జై సమైక్యాంధ్ర అంటూ గర్జించారు.  ఆటపాటలతో విద్యార్ధులు సమైక్యగళం వినిపించారు. ఉద్యోగులు, వ్యాపారులు భిన్నరంగాల వారు తరలివచ్చి సమైక్యవాణి వినిపించారు. విభజించి పాలించు అనే విదేశీ సిద్ధాంతం అమలు చేస్తే మరో స్వతంత్ర పోరాటం తప్పదన్నారు. ఉదమ్యాన్ని అణిచేయాలనుకుంటే విప్లవమవుతుందని హెచ్చరించారు.

సీమాంధ్రలోని 13 జిల్లాల నినాదం ఒక్కటే. అదే సమైక్యాంధ్ర.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement