
సాక్షి, అమరావతి: ప్రజల కష్టాలు వింటూ.. వారి కన్నీళ్లు తుడుస్తూ.. భవిష్యత్తుపై వారికి భరోసానిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మంగళవారానికి ఏడాదికాలం పూర్తిచేసుకుంది. ఈ ఏడాదికాలంగా ఎండనకా.. వాననకా.. అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ అలుపెరుగని బాటసారిలా ముందుకుసాగారు. పాదయాత్ర మార్గంలో అవ్వలు, తాతలు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కర్షకులు, కార్మికులు ఇలా ఒక్కరేంటి.. అన్ని వర్గాల ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్యలు చెప్పుకొన్నారు. చంద్రబాబు పాలనలో తాము ఎదుర్కొంటున్న కష్టాలను, నష్టాలను జననేత వద్ద మొరపెట్టుకున్నారు.. లక్షలాది మంది ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలిచ్చారు. ఈ కష్టాల నుంచి తమను గట్టెక్కించాలంటూ వేడుకున్నారు.
ఎన్నెన్ని విన్నపాలో.. వాటిలో కొన్ని..
- ఎన్నికలకు ముందు చంద్రబాబు.. ఇంటికో ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని, ప్రభుత్వ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక తమను మోసగించారని నిరుద్యోగ యువత జననేత వద్ద మొరపెట్టుకున్నారు.
- వ్యవసాయ రుణాల మాఫీ అని ప్రకటించి చివరకు తమను వంచించారని.. రుణమాఫీ కాకపోగా, చంద్రబాబు నిర్వాకం కారణంగా వడ్డీలు పెరిగిపోయి మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
- బేషరతుగా డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి.. నయాపైసా కూడా మాఫీ చేయలేదని మహిళలు విన్నవించారు. బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారాన్ని తానే తెప్పించి ఇస్తానని చెప్పి.. తీరా ఇప్పుడు ముఖం చాటేశారని చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. తాకట్టు బంగారాన్ని వేలం వేస్తున్నట్లు బ్యాంకుల నుంచి నోటీసులొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
- అనారోగ్యంతో ఉన్న తమ బిడ్డలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందక నానా అగచాట్లుపడుతున్నామంటూ పలువురు తల్లిదండ్రులు జగన్ వద్ద వాపోయారు.
- తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామన్న హామీతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపారని.. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు జననేత వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఉన్న ఉద్యోగాలకు కూడా భద్రత లేకుండాపోయిందని, అన్యాయంగా పలువుర్ని తొలగించారని కన్నీళ్ల పర్యంతమయ్యారు.
- తమకు, తమ కుటుంబాలకు భరోసాగా ఉన్న పాత పెన్షన్ విధానాన్ని ఎత్తేయించి.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తెచ్చారని సీపీఎస్ ఉద్యోగులు ప్రతిపక్ష నేతకు విన్నవించారు.
- తమకు పింఛన్లు రావడం లేదని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తమ పింఛన్లు తొలగించారని, పార్టీ వివక్ష చూపుతూ జన్మభూమి కమిటీలు తమకు పింఛన్లు రాకుండా అడ్డుకుంటున్నాయని వేలాది మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గోడు వెళ్లబోసుకున్నారు.
- అర్హులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలను ఇవ్వడం లేదంటూ వేలాది గ్రామాల్లో ప్రజలు జగన్‌కు మొరపెట్టుకున్నారు.
- ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని బాబు నిర్వీర్యం చేస్తున్నారని వాపోయారు.
- సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, వైఎస్ హయాంలో దాదాపు పూర్తి చేసిన ప్రాజెక్టులకు సంబంధించి మిగిలిన పనులు కూడా పూర్తి చేయించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
- ఆటోకార్మికులు, వివిధ వర్గాల వారు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. అందరి కష్టాలను సావధానంగా వింటూ.. మన ప్రభుత్వం రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇస్తూ.. నవరత్నాల పథకంతో వారి భవిష్యత్తుకు భరోసా కల్పి స్తూ జననేత ముందుకు సాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment