ఒంటరి పోరుకు సై: అసద్
సాక్షి, హైదరాబాద్: ‘‘మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులతో సంబంధం లేకుండా ఒంటరి పోరుకు సిద్ధంకండి. ఒకవేళ పొత్తులు కుదిరితే చివరి క్షణంలో ఆలోచిద్దాం’’ అని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. గురువారమిక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ బాధ్యులతో వేర్వేరుగా భేటీ నిర్వహించి మున్సిపల్ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. మున్సిపల్ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి, ఎన్నికల బరిలో దిగే స్థానాలు, విజయావకాశాలు, అభ్యర్థుల గురించి ఆరా తీశారు.
జిల్లా బాధ్యులకే అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను అప్పగించి పార్టీ ‘బి’ ఫామ్‌లను సైతం ముందుగానే అందజేశారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పొత్తులపై ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒకవేళ పొత్తులు కుదిరినా, కుదరకపోయినా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల బాధ్యులు సమన్వయంతో వ్యవహరించి అభ్యర్థుల ఎంపిక వివాదాస్పదం కాకుండా అన్నివిధాలా సమర్థులకు టికెట్ ఇవ్వాలని పేర్కొన్నారు.
పార్టీలో పనిచేసే సమర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఒకవేళ పార్టీ శ్రేణుల కంటే సమర్థవంతులై, స్థానికంగా పట్టున్న తటస్థులు ఉంటే వారిని బరిలో దింపేందుకు ప్రయత్నించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వ్‌డ్ వార్డుల్లో సైతం పార్టీకి పట్టు, సమర్థులైన అభ్యర్థులుంటే వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేశామన్నది ముఖ్యం కాదని.. ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తామన్నదే ముఖ్యమని పేర్కొన్నారు. అలాంటి వార్డులను మాత్రమే గుర్తించి బరిలో దిగాలని స్పష్టంచేశారు.
జిల్లా బాధ్యులు తమ పరిధిలోని పట్టణాల్లో విసృ్తతంగా పర్యటించి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. ప్రత్యర్థుల వ్యూహాలను పసిగడుతూ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లి విజయకేతనం ఎగురవేయాలని అసదుద్దీన్ పిలుపునిచ్చారు. వేర్వేరుగా జరిగిన ఈ భేటీల్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, తిరుపతి, కర్నూలు, అనంతరపురం జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు.