
మా మద్దతే కీలకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మజ్లిస్ మద్దతు లేకుండా ‘ప్రభుత్వం’ ఏర్పాటు చేయడం అసాధ్యమని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో మజ్లిస్ కీలకంగా మారనున్నట్లు చెప్పారు. శనివారం రాత్రి చంచల్‌గూడ జూనియర్ కళాశాల మైదానంలో మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రసుత రాజకీయ పరిస్థితులతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంటే.. టీడీపీ అధికార కలలు కంటోందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-బీజేపీ కలిసినా 18 శాతానికి మించి ఓట్లు రావని చెప్పారు. టీఆర్‌ఎస్ కీలకంగా మారినా అధికారం కోసం మజ్లిస్ మద్దతు తప్పదన్నారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం, సీపీఎం, సీపీఐ, టీఆర్‌ఎస్ మహాకూటమిగా ఏర్పడినప్పటికీ 33.38 శాతం మించి ఓట్లు సాధించలేకపోయిన విషయాన్ని గుర్తు చేశారు.
తాజా రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తగ్గుముఖం పట్టిందన్నారు. వచ్చే ఎన్నికలను సవాల్‌గా తీసుకొని మరిన్ని స్థానాలను కైవసం చేసుకొంటామని అసదుద్దీన్ ప్రకటించారు. గుజరాత్ అల్లర్లలో నరేంద్ర మోడీకి కోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంపై మాట్లాడుతూ.. గుజరాత్ ఘోరకలి వెనుక మోడీ ప్రమేయం ఉందనడానికి అనేక ఆధారాలున్నా కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ముస్లింలు గుజరాత్ అల్లర్లను మరువరని, మోడీని క్షమించరని తెల్చి చెప్పారు.
టీడీపీలో మైనారిటీ నేతలకు సిగ్గులేదా?
మోడీతో చంద్రబాబు జతకట్టేందుకు ప్రయత్నిస్తుంటే టీడీపీలోని మైనార్టీ నాయకులు సిగ్గులేకుండా ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. గతంతో బీజేపీతో పొత్తు వల్ల నష్టపోయిన విషయాన్ని, తర్వాత ముస్లింలను క్షమించాలని కోరిన వారికి బాబు యత్నాలు కనిపించడం లేదా అని నిలదీశారు. ముజఫర్‌నగర్ ఘటన బాధాకరమని, ములాయంసింగ్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో ముస్లిం లౌకికవాదులంతా అణిచివేతకు గురయ్యారని ఆరోపించారు. 2014 ఎన్నికలలో మోడీ అధికారంలోకి రాకుండా దేశవ్యాప్తంగా లౌకిక పార్టీలను ఏకీకృతం చేస్తామని చెప్పారు. ఎన్నికల సంస్కరణలో మార్పు రావాలని, ప్రాధాన్యత ఓటింగ్ ఉండాలన్నారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రసంగిస్తూ దేశంలో హిందూరాజ్యం ఏర్పాటును అడ్డుకుని తీరుతామని పునరుద్ఘాటించారు. ఈ సభలో ఎంఐఎం శాసనసభ్యులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.