
మా వైఖరి రాయల తెలంగాణే: అసదుద్దీన్ ఒవైసీ
అనంత, కర్నూలు జిల్లాలను ‘టీ’ స్టేట్‌తో కలపాలి
కాంగ్రెస్ ‘విభజన’ నిర్ణయాన్ని అసంతృప్తిగానే అంగీకరించాం
హైదరాబాద్‌ను యూటీగా అంగీకరించం..
‘తెలంగాణ’లో సీమాంధ్రులను భాషా పరమైన మైనారిటీలుగా ప్రకటించాలి
విభజనపై జీఓఎంకు డిమాండ్లు
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్‌కే తాము ఇంతకుముందు కట్టుబడి ఉన్నామని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అయిష్టంగానే అంగీకరించామని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణ జిల్లాలతో కలుపుతూ రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలన్నదే తమ వైఖరి అని ఆయన స్పష్టంచేశారు. హైదరాబాద్‌ను తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉంచాలని, ఈ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయటాన్ని తాము అంగీకరించేది లేదని పునరుద్ఘాటించారు. తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రులను భాషాపరమైన మైనారిటీలుగా ప్రకటించవచ్చని సూచించారు. అసద్ బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందానికి తమ పార్టీ సమర్పించిన దాదాపు 70 పేజీల నివేదికను విడుదల చేశారు. ‘‘మేం ఇంతకుముందు సమైక్యాంధ్రప్రదేశ్‌కే కట్టుబడి ఉన్నాం. ఒకవేళ రాష్ట్ర విభజన అనివార్యమయ్యే పక్షంలో రాయలసీమలోని నాలుగు జిల్లాలను, తెలంగాణలోని పది జిల్లాలను కలిపి రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని గతంలోనే శ్రీకృష్ణ కమిటీకి నివేదించాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న రాజకీయ నిర్ణయం తీసుకుంటే.. దానికి హైదరాబాద్ రాజధాని కావాలని, హైదరాబాద్ నగరానికి కేంద్ర పాలిత ప్రాంతం హోదాను అంగీకరించబోమని కూడా మేం స్పష్టంచేశాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, ఆ నిర్ణయాన్ని ఇతర రాజకీయ పార్టీలు బలవంతంగా అంగీకరించేలా చేసినందున.. ఆ ప్రకటనను మేం అయిష్టంగానే అంగీకరించాం. ఏదేమైనా.. కొత్త రాష్ట్రం ఏర్పాటులో తెలంగాణలోని పది జిల్లాలతో పాటు రెండు రాయలసీమ జిల్లాలు అనంతపురం, కర్నూలులను కలపాలని సిఫారసు చేయాల్సిందిగా జీఓఎంకు విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని అసద్ చెప్పారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి పంపిన పార్టీ నివేదికలోనూ పేర్కొన్నారు. జీఓఎం విధివిధానాలకు సంబంధించి తమ అభిప్రాయాలను నివేదించారు.
రాయల తెలంగాణతోనే సమన్యాయం...
అనంతపురం, కర్నూలు జిల్లాలతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తేనే సమన్యాయం జరుగుతుందని అసద్ పేర్కొన్నారు. అప్పుడే నదీ జలాలు, రాజధాని సమస్య ఉండబోదన్నారు. వర్షాభావ పరిస్థితులతో రాయలసీమలోని అనంతపురం, కర్నూలు తీవ్ర కరవును ఎదుర్కొంటున్నాయని చెప్పారు. సీమ జిల్లాలను తెలంగాణలో కలపకుంటే తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా లేదా, పాక్షిక ఉమ్మడి రాజధానిగా కానీ, యూటీగా కానీ ఏర్పాటు చేస్తే సహించేది లేదని ఆసదుద్దీన్ స్పష్టంచేశారు. ఉమ్మడి రాజధానితో శాంతి భధ్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఉమ్మడి రాజధాని అనివార్యమైతే ఖైరతాబాద్ మండలం లేదా, అసెంబ్లీ నియోజకవర్గాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటుతో మైనారిటీలు, దళితులకే అధిక నష్టం వాటిల్లుతుందని అసద్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే సంఘ్‌పరివార్, బీజేపీలు బలపడి ముస్లిం మైనారిటీలపై దాడులకు దిగే ప్రమాదం లేకపోలేదని అసద్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే.. జిల్లాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న సీమాంధ్రలకు ప్రత్యేక హక్కులు కల్పించాలని, వారిని భాషారమైన మైనారిటీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఉర్దూను తెలుగుతో పాటు ప్రధమ అధికార భాషాగా గుర్తించాలని, మైనారిటీల సంక్షేమానికి తగిన బడ్జెట్ కేటాయించాలని కోరారు.
జగన్‌తో స్నేహం కొనసాగుతోంది...
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో తమ స్నేహం కొనసాగుతోందని అసదుద్దీన్ పేర్కొన్నారు. రాజకీయ పంథాలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీతో జతకట్టిన వారు తమకు పరాయివారవుతారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్రంలో మోడీని ప్రజలు గద్దెనెక్కనివ్వరని, లౌకికవాదులకే పట్టం కట్టడం ఖాయమని అభిప్రాయపడ్డారు. తృతీయ ఫ్రంట్ విషయాన్ని ఎన్నికల ఫలితాల తర్వాత ఆలోచిద్దామన్నారు.