తాండూరు రూరల్, న్యూస్‌లైన్: ఓ గని కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది చంపేశారు. పేకాట ఆడే సమయంలో డబ్బుల విషయమై తలెత్తిన గొడవ హత్యకు దారి తీసి ఉండొచ్చని కుటుంబీకులు, గ్రామస్తులు అనుమానిస్తున్నారు. హతుడి కుటుంబసభ్యులు, రూరల్ సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ హుస్సేన్(26) స్థానికంగా ఉన్న ఓ నాపరాతి గనిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో బుధవారం హుస్సేన్ తండ్రి బషీర్‌మియా అతడి ఆచూకీ కోసం గాలించసాగాడు. ఈ క్రమంలో కొడుకు తరచూ జూదం ఆడే గ్రామ శివారులోని ఓ గది వద్దకు వెళ్లాడు. సమీపంలోని ఓ గుంతలో బండరాళ్ల కింద ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. హతుడి దుస్తుల ఆధారంగా అతడు తన కుమారుడు హుస్సేనేనని బషీర్‌మియా గుర్తించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలంలో పెద్దఎత్తున గుమిగూడారు. రూరల్ సీఐ రవి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హుస్సేన్ కుడి కన్ను, కణత, తల భాగాలపై తీవ్ర గాయాలు ఉన్నాయి. బండరాళ్లతో మోదిన ఆనవాళ్లు కనిపించాయి.
ఘటనా స్థలానికి సమీపంలోని ఓ గదిలో పేక ముక్కలు, మద్యం సీసాలు పడిఉన్నాయి. పోలీసులు హైదరాబాద్ నుంచి డాగ్‌స్క్వాడ్ ను రప్పించారు. జాగిలం ఘటనా స్థలం నుంచి గ్రామంలోని భవానీనగర్‌లోని ఓ కిరాణం దుకాణం వద్దకు, అక్కడి నుంచి సంగెంకాలన్ గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వడిచర్ల మొగులప్ప హోటల్ వరకు వెళ్లి ఆగింది. వికారాబాద్ నుంచి వచ్చిన క్లూస్ టీం వివరాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. హతుడి తండ్రి బషీర్ మియా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవి తెలిపారు.
తల్లికి అనారోగ్యం.. తండ్రి అనంతలోకాలకు
హతుడు హుస్సేన్‌కు భార్య బిస్మిల్లా, కూతురు ఇసాత్(7), కుమారుడు, పాష(2) ఉన్నారు. అనారోగ్యంతో బిస్మిల్లా కొన్నాళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలు నాయనమ్మ మొగులన్‌బీ వద్ద ఉంటున్నారు. తల్లి అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోవడం, తండ్రి హత్యకు గురవడంతో పిల్లలు అనాథలయ్యారు. హుస్సేన్ మృతితో తల్లిదండ్రులు, పిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు.
ప్రాణం తీసిన పేకాట!
Published Thu, Oct 10 2013 3:16 AM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM
Advertisement
Advertisement