సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : బహుళ అంతస్తుల నిర్మాణంలో బిల్డర్లు కనీస ప్రమాణాలూ పాటించడం లేదు. దీంతో ఆ ఆపార్ట్‌మెంట్ ఉన్న కాలనీవాసులకు ఇబ్బందులు తప్ప డం లేదు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటుండడంతో స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై స్పందించిన అధికారులు నగరంలోని 17 అపార్ట్‌మెంట్ల బిల్డర్లకు నోటీసులు జారీ చేశారు.
పట్టణాలు, నగరాలు విస్తరిస్తుండడంతో అపార్టుమెంట్ కల్చర్ పెరుగుతోంది. దీంతో అపార్టుమెంట్ల నిర్మాణాలూ పెరుగుతున్నాయి. జిల్లాలో 200లకుపైగా బహుళ అంతస్తుల భవనాలున్నా యి. ఒక్క నిజామాబాద్ నగరంలోనే 110కుపైగా ఉన్నాయి. ఇందులో 20 అపార్ట్‌మెంట్లు నిర్మాణ దశ లో ఉన్నాయి. ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ పట్టణ ప్రాంతాలతో పాటు నిజామాబాద్ నగర సమీపంలోని ముబారక్‌నగర్, గూపన్‌పల్లి, బోర్గాం తదితర గ్రామాల పరిధిలోనూ అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. అయితే బహుళ అంతస్తుల నిర్మాణానికి సంబంధించిన నియమ నిబంధనల బిల్డర్లు తుంగలో తొక్కుతున్నారు. అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో వీరి ఇష్టారాజ్యం కొనసాగుతోంది. దీంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. అపార్టుమెంట్ల సమీపంలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
నిబంధనలు ఇవి
నిజామాబాద్ నగరంలో బహుళ అంతస్తుల నిర్మాణానికి నిబంధనలు విధించారు. నగరంలో 300 చదరపు గజాల స్థలంలో జీ+2 అంతస్తులకు అనుమతి ఇచ్చేందుకు మాత్రమే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అధికారం ఉంది. ఆపైన బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టడానికి మున్సిపల్ ఆర్‌డీ, మున్సిపల్ డెరైక్టర్ల అనుమతి పొందాల్సి ఉంటుంది. వెయ్యి చదరపు గజాల స్థలంలో ఐదు అంతస్తులను నిర్మించేందుకు మున్సిపల్ ఆర్‌డీ అనుమతి, ఆపైన అంతస్తుల నిర్మాణం చేపట్టాలనుకుంటే మున్సిపల్ డెరైక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి అపార్టుమెంట్‌కు పార్కింగ్ స్థలం ఉండాలి. అగ్నిమాపక శాఖ అనుమతులు తప్పనిసరి. బహుళ అంతస్తు చుట్టూ నిబంధనలకు అనుగుణంగా ఖాళీ స్థలం, ప్రహరీ వంటి నిర్మాణాలు చేపట్టాలి. తాగునీటి సరఫరాతోపాటు డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి ముం దస్తు అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాతే అపార్టుమెంట్ నిర్మాణం ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే బహుళ అంతస్తుల నిర్మాతలు ఈ నిబంధన లను తుంగలో తొక్కుతున్నారు. నిబంధనలను పట్టించుకోకుండా, ఇష్టారాజ్యంగా అపార్టుమెంట్లు నిర్మించి, విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో వీటిని కొనుక్కున్నవారే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో నివసించేవారూ ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
వినాయక్‌నగర్‌లో..
నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్ ప్రాంతం లో 22 అపార్ట్‌మెంట్లున్నాయి. ఇందులో 18 నిర్మాణా లు పూర్తయ్యాయి. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. వీటిలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. దీంతో ఆయా అపార్టుమెంట్ల సమీపంలో నివసిస్తున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అపార్టుమెంట్లలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురికి నీరు నిల్వ ఉంటోందని, దీంతో దోమలు పెరుగుతున్నాయని, తాము అనారోగ్యానికి గురవుతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులు స్పందించి నిర్మాణాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 17 అపార్టుమెంట్లకు సంబంధించి వాటి యజమానులకు మంగళవారం నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో డ్రైనేజీని సరి చేయాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో హెచ్చరించారు.
అంతటా ఇదే పరిస్థితి
జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో 90 వరకు అపార్టుమెంట్లున్నాయి. మరికొన్ని బహుళ అంతస్తులు నిర్మాణ దశలో ఉన్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇళ్ల నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకుంటే సవాలక్ష కొర్రీలు పెట్టే అధికారులు.. బహుళ అంతస్తుల నిర్మాణానికి మాత్రం కళ్లు మూసుకొని అనుమతులు ఇస్తుండడం విమర్శలకు తావిస్తోంది. నియమ నిబంధనల ప్రకారంగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాల్సిన అధికారులు అమ్యామ్యాలకు ఆశపడుతుండడంతో బిల్డర్ల ఇష్టారాజ్యం కొనసాగుతుందన్న ఆరోపణలున్నాయి.
నోటీసులిచ్చాం
వినాయక్‌నగర్ ప్రాంతంలోని బస్వాగార్డెన్ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేని 17 అపార్టుమెంట్లను గుర్తించాం. వాటి యజమానులకు నోటీసులు ఇచ్చాం. వారంలోగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించాం.
-మల్లికార్జున్, ఏసీపీవో, నగర పాలక సంస్థ, నిజామాబాద్
బహుళ అంతస్తుల్లో ఉల్లంఘనలు
Published Wed, Dec 18 2013 6:44 AM | Last Updated on Sat, Aug 18 2018 8:37 PM
Advertisement
Advertisement