సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ గ్రూపునకు చెందిన ఆస్తుల్లో అత్యంత ఖరీదైన హాయ్‌ల్యాండ్ వేలానికి రంగం సిద్ధమైంది. హాయ్‌ల్యాండ్ కనీస ధరను రూ.600 కోట్లుగా హైకోర్టు నిర్ణయించింది. కనీస ధర ఖరారైన నేపథ్యంలో వెంటనే అమ్మకం నోటీసును, ఇతర ప్రకటనలను జారీ చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ నోటీసు, ప్రకటనలకు స్పందించి ఔత్సాహికులు దాఖలుచేసే బిడ్లను తెరవడానికి వీల్లేదని, వాటిని సీల్డ్‌కవర్‌లో ఉంచి తమ ముందుంచాలని కన్సార్టియం అధీకృత అధికారికి నిర్దేశించింది. సీల్డ్ కవర్లలో ఉన్న బిడ్లను ఫిబ్రవరి 8న తామే స్వయంగా కోర్టు హాలులోనే తెరుస్తామని స్పష్టం చేసింది. బిడ్లు దాఖలు చేసినవారు ఆరోజున కోర్టుకొచ్చి వేలం ప్రక్రియలో పాల్గొనవచ్చునంది. కనీస ధర రూ.600 కోట్లకు మించి హాయ్‌ల్యాండ్‌ను కొనుగోలు చేసే ఔత్సాహికులుంటే వారిని తమ ముందుకు తీసుకురావచ్చునని అగ్రిగోల్డ్, హాయ్‌ల్యాండ్ యాజమాన్యాలకు స్పష్టం చేసింది. వీరు సైతం సీల్డ్‌కవర్‌లోనే బిడ్లను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.
వేలం విషయంలో ఇతర షరతులు, నిబంధనలన్నింటినీ చట్టప్రకారం విధించుకునే వెసులుబాటు బ్యాంకుల కన్సార్టియంకు ఉందని తేల్చిచెప్పింది. కాగా, మిగిలిన ఆస్తుల వేలం కనీస ధరను వచ్చేవారం నిర్ణయిస్తామని తెలిపింది. మరోవైపు అగ్రిగోల్డ్ టేకోవర్‌కు ముందుకొచ్చిన సుభాష్‌చంద్ర ఫౌండేషన్ కోర్టులో డిపాజిట్ చేసిన రూ.10 కోట్లలో రూ.7 కోట్లను వెనక్కిస్తూ నిర్ణయించింది. మిగతా రూ.3 కోట్లను అగ్రిగోల్డ్ డిపాజిటర్ల ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిటర్ల నుంచి కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ డిపాజిటర్ల సంఘంతోపాటు పలువురు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం తెలిసిందే. వీటిని జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డి ఓ అఫిడవిట్‌ను కోర్టు ముందుంచారు.
ఓవైపు ఓటీఎస్ ఆఫరిచ్చి.. మరోవైపు సర్ఫేసీ చట్టం కింద వేలం వేస్తోంది..
ఆర్కా లీజర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు 16.33 శాతం వాటాలు, ఇతర గ్రూపు కంపెనీలకు 99 శాతం ఈక్విటీ వాటాలున్నాయని అగ్రిగోల్డ్ యాజమాన్యం ఈ అఫిడవిట్‌లో పేర్కొంది. హాయ్‌ల్యాండ్ ఆర్కా లీజర్‌కు చెందినదని తెలిపింది. ఎస్‌బీఐకి రూ.54.26 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ బ్యాంకు వన్ టైం సెటిల్‌మెంట్(ఓటీఎస్) కింద రూ.22.38 కోట్లు చెల్లించాలంటూ ఆగస్టు 14న లేఖ రాసిందని చెప్పింది. ఇదేరీతిలో ఓటీఎస్ ఆఫర్ ఇస్తారేమోనని ఇతర బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని, దీనివల్ల ఆస్తుల్ని ఎక్కువ ధరకు అమ్మి చిన్న డిపాజిటర్లకు చెల్లించవచ్చని భావించామని, అయితే టేకోవర్ ప్రతిపాదన నుంచి సుభాష్‌చంద్ర ఫౌండేషన్ తప్పుకోవడంతో ఎస్‌బీఐ తానిచ్చిన ఓటీఎస్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడం సరికాదని పేర్కొంది.
కనీస ధరను రూ.550 కోట్లుగా నిర్ణయించండి...
ఈ సమయంలో ఎస్‌బీఐ కన్సార్టియం తరఫు న్యాయవాది నరేందర్‌రెడ్డి స్పందిస్తూ.. హాయ్‌ల్యాండ్ వేలానికి కనీస ధరను నిర్ణయించేందుకు వీలుగా విచారణ శుక్రవారానికి వాయిదా పడిందని గుర్తుచేశారు. తాము హాయ్‌ల్యాండ్‌కు రూ.503 కోట్లను కనీస ధరగా నిర్ణయించామని, సుభాష్‌చంద్ర ఫౌండేషన్ రూ.550 కోట్లుగా నిర్ణయించిందని, ఈ రెండింటి ఆధారంగా కనీస ధరను నిర్ణయించాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ అభిప్రాయాన్ని ధర్మాసనం కోరింది. కనీస ధరను రూ.550 కోట్లుగా నిర్ణయించవచ్చని ఆయన తెలిపారు. ఈ మొత్తానికి అభ్యంతరం లేదని డిపాజిటర్ల సంఘం తరఫు న్యాయవాది చెప్పారు. అయితే కనీస ధరను రూ.600 కోట్లుగా నిర్ణయిస్తున్నామంటూ ఆ మేరకు ఉత్తర్వుల జారీకి ధర్మాసనం సిద్ధమైంది.
ఆశలు అడియాసలు కావడానికి ఎంతో సమయం పట్టదు...
ఈ సమయంలో ఆర్కా లీజర్ తరఫు సీనియర్ న్యాయవాది శ్రీధరన్ స్పందిస్తూ.. సర్ఫేసీ చట్టం కింద బ్యాంకుల వేలం చర్యలను సవాలు చేస్తూ తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని, అందుకు అనుమతినివ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. పిటిషన్ ఉపసంహరణకు అనుమతినిచ్చింది. దీంతో హాయ్‌ల్యాండ్ వేలానికి ఎటువంటి అడ్డంకుల్లేవని తెలిపింది. హాయ్‌ల్యాండ్ విలువను ఆర్కా రూ.1,800 కోట్లుగా, అగ్రిగోల్డ్ యాజమాన్యం రూ.1,000 కోట్లుగా చెప్పిందని, కానీ వాస్తవ పరిస్థితుల్లో దాని విలువ వేరుగా ఉందని స్పష్టం చేసింది. ఆశలు అడియాసలయ్యేందుకు ఎంతో సమయం పట్టదని, అందువల్ల వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ హాయ్‌ల్యాండ్ వేలానికి కనీస ధరను రూ.600 కోట్లుగా నిర్ణయిస్తున్నామని తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటీసు, ఇతర ప్రకటనలను జారీ చేయాలని నరేందర్‌రెడ్డికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment