సాక్షి, గుంటూరు : పల్నాడు అక్రమ మైనింగ్ కేసులో అమాయకులను ఇరికించి అసలు సూత్రధారులు తప్పించుకున్నారంటూ నలుగురు నిందితులు తాజాగా హైకోర్టును ఆశ్రయించడంతో మైనింగ్ మాఫియాలో కలవరం మొదలైంది. ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో నిర్వహించే ఎలాంటి విచారణను ఎదుర్కొనేందుకైనా తాము సిద్ధమేనని న్యాయస్థానానికి నివేదించడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండదండలతో అక్రమ క్వారీయింగ్ సాగిస్తున్న మైనింగ్ మాఫియా బెంబేలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసేదర్యాప్తు సంస్థలపై తనకు నమ్మకం లేదని, సీబీఐతో విచారణకు ఆదేశించాలని కేసులో నిందితుడిగా ఉన్న ఓర్సు ప్రకాష్ కోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే.
తప్పు చేయకుంటే భయమెందుకు?
గుంటూరు జిల్లా గురజాల నియోజవర్గంలో అక్రమ మైనింగ్‌కు సంబంధించి సర్వే పేరుతో అధికారులు అసలు దొంగలను వదిలేసి కూలీలు, అమాయకులపై కేసులు నమోదు చేశారు. అయితే వీరంతా విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించడంతో అక్రమ మైనింగ్‌పై పోరాడిన వారిని కేసుల్లో ఇరికించిన అధికార పార్టీ ప్రజాప్రతినిధికి గొంతులో వెలక్కాయ పడినట్లైంది. చివరకు ఈ వ్యవహారం ఎటువైపు మళ్లుతుందోననే ఆందోళనలో మైనింగ్ మాఫియా ఉన్నట్లు సమాచారం. ఏ తప్పూ చేయకుంటే సీబీఐ విచారణ ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యే యరపతినేని ఎందుకు జంకుతున్నారంటూ ప్రజలు నిలదీస్తున్నారు.
శాటిలైట్ సర్వే కూడా చేయలేదు
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అక్రమ మైనింగ్‌తో తెల్లరాయిని దోచేసిన ఘనులను గుర్తించేందుకు హైకోర్టు ఆదేశాలతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయింది! సుమారు కోటి టన్నుల వరకు దోపిడీ జరిగినట్లు అంచనాలు ఉన్నప్పటికీ శాటిలైట్ సర్వే కూడా చేయకుండా 31.53 లక్షల టన్నుల తెల్లరాయిని మాత్రమే తరలించారంటూ నివేదిక ఇచ్చారు. కేసులో నిందితులుగా ఉన్న ఓర్సు ప్రకాష్, తిప్పవజ్జుల నారాయణశర్మ, తిప్పవజ్జుల సీతారామాంజనేయులు, రాజేటి జాకబ్ తమను ఇందులో అన్యాయంగా ఇరికించారంటూ హైకోర్టుకు నివేదించడం కలకలం రేపింది.
ఎమ్మెల్యే అనుచరుల పట్ల ఉదాశీన వైఖరి
అక్రమ మైనింగ్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలంటూ వైఎస్సార్ సీపీతోపాటు పలువురు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వంగానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుగానీ ముందుకు రాలేదు. ఎమ్మెల్యే కనుసన్నల్లో మైనింగ్ నిర్వహించే అధికార పార్టీ నేతలు ఘట్టమనేని నాగేశ్వరరావు, బుల్లబ్బాయి, ముప్పన వెంకటేశ్వర్లుకు అధికారులు నోటీసులు ఇవ్వకుండా, విచారించకుండా ఉదాశీనంగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment