కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటల శివారు ప్రాంతంలో అనుమతి లేకుండా అక్రమంగా తవ్విన కొండలు
సాక్షి, అమరావతి : ఇన్నాళ్లూ అధికారం అడ్డం పెట్టుకుని అక్రమాలు సాగించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా దందా కొనసాగిస్తున్నారు. అనుమతి లేని చోట కొండలను అక్రమంగా తవ్వేస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామ రెవెన్యూ పరిధి దొనబండ సర్వే నంబర్ 801లోని 1,204 ఎకరాల్లో 94 క్వారీలకు స్థానిక టీడీపీ నేతలు గత ప్రభుత్వ హయాంలో అనుమతులు తెచ్చుకున్నారు. ఒక్కోచోట 5 నుంచి 10 హెక్టార్లలోపు మాత్రమే క్వారీయింగ్‌కు అనుమతులు లభించాయి.
క్వారీయింగ్‌కు అనుమతించిన ప్రాంతంలో మూడేళ్ల కిందటే తవ్వకాలు పూర్తయ్యాయి. ఆ తరువాత టీడీపీ నేతల కన్ను అక్కడికి సమీపంలోనే ఉన్న కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌పై పడింది. క్వారీయింగ్ పూర్తి చేసిన ప్రాంతానికి చెందిన అనుమతులనే చూపిస్తూ రిజర్వ్ ఫారెస్ట్‌లోకి చొచ్చుకుపోయారు. అటవీ ప్రాంతంలో కొండలను నిత్యం బ్లాస్టింగ్‌లతో పిండి చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమీప బంధువులే ఇక్కడ అక్రమ క్వారీలు నిర్వహిస్తుండడం గమనార్హం. అక్రమ మైనింగ్‌కు సహకరించినందుకు ఎన్నికల సమయంలో టీడీపీకి కొందరు వ్యక్తులు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలున్నాయి.
అంతరించిపోతున్న వన్యప్రాణులు
కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ 150 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ అపార ఖనిజ సంపదతోపాటు వన్యప్రాణులు జీవిస్తున్నాయి. 32 రకాల జంతువులున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ అటవీ ప్రాంతంలో 48 రకాల అరుదైన వృక్ష జాతులు కూడా ఉన్నాయి. ఇక్కడ 100 హెక్టార్లలో కొండలు విస్తరించి ఉండగా ఇప్పటికే దాదాపు 80 హెక్టార్ల పరిధిలో కొండలను మైనింగ్ మాఫియా తవ్వేసింది. ఈ క్రమంలో అరుదైన వృక్ష జాతులు నాశనమయ్యాయి. జిలెటిన్ స్టిక్స్‌తో బ్లాస్టింగ్‌లు చేస్తుండడంతో వన్యప్రాణులు కన్ను మూస్తున్నాయి.
హద్దులను చెరిపి
క్వారీయింగ్‌కు మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చేటప్పుడు సర్వే నిర్వహించి హద్దులు నిర్ధారించాలి. అయితే, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అండదండలతో పరిటాల క్వారీలకు నిర్వాహకులు హద్దులే లేకుండా చేశారు. 94 క్వారీలకు హద్దులు ఏమిటో ఎవరికి తెలియవు. హద్దులు చెరిపేసి... సరిహద్దులు దాటి రెవెన్యూ, ఫారెస్ట్ భూముల్లోకి మైనింగ్ మాఫియా చొచ్చుకుపోయింది.
నెల రోజులపాటు విరామం
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో తమ అక్రమ మైనింగ్ వ్యవహారం బయటపడకుండా నిర్వాహకులు నెల రోజుల పాటు తవ్వకాలు నిలిపేశారు. అయితే, తాజాగా మళ్లీ బ్లాస్టింగ్‌లు ప్రారంభించారు. ఇక్కడి నుంచి వచ్చే దుమ్ము, ధూళి వల్ల తమ పంటలకు నష్టం వాటిల్లుతోందని సమీప ప్రాంత రైతులు గగ్గోలు పెడుతున్నా మైనింగ్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హద్దులు నిర్ధారించి, అక్రమ మైనింగ్‌ను అరికట్టాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.
పర్యావరణానికి తీవ్ర నష్టం
రిగ్ బ్లాస్టింగ్‌ల వల్ల వచ్చే భారీ శబ్దాలను భరించలేక వణ్యప్రాణులు ఈ ప్రాంతం నుంచి పారిపోతున్నాయి. పర్యావరణం పరంగా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అక్రమంగా అటవీ భూముల్లో మైనింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
– బూరుగు లెనిన్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, కంచికచర్ల
Comments
Please login to add a commentAdd a comment