సాక్షి, అమరావతి: చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెడుతుంటే అసెంబ్లీలో నుంచి చంద్రబాబు పారిపోయారని, బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన వ్యతిరేకమా అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు నాయుడు గత పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా బడుగు, బలహీన వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించామని సురేష్ తెలిపారు. ఇలాంటి చట్టం చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఎప్పుడైనా చేశారా? అని ప్రశ్నించారు. సభలో తమ సమస్యలపై మాట్లాడండి అని ప్రజలు మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే.. కరకట్టపై అక్రమ నిర్మాణంలో కూర్చోని మీడియా సమావేశం నిర్వహించారని ధ్వజమెత్తారు. ఓట్ల కోసమే ఎన్నికల సమయంలో కొత్త పథకాలను ప్రకటించారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో జరిగిన పనులపై చర్చకు సిద్ధమా?’ అని మంత్రి సవాల్ విసిరారు.
మీడియా సమావేశంలో మంత్రి సురేష్ మాట్లాడుతూ.. ‘‘40 ఏళ్లలో చంద్రబాబు రాజకీయ జీవితంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏమైనా చేశారు?. కీలకమైన బిల్లుపై చర్చలో మాట్లాడకుండా ఉన్నారంటే చంద్రబాబు ముమ్మాటికి బలహీన వర్గాల వ్యతిరేకే. బీసీ, ఎస్సీలను కేవలం ఓట్ బ్యాంక్‌గానే చంద్రబాబు భావించారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని గొప్ప చట్టాన్ని తీసుకువచ్చాం. కానీ మీరు దానిని వ్యతిరేకిస్తూ.. పరిశ్రమలు రావని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దశల వారిగా మద్యపాన నిషేధం అమలుకు బిల్లు రూపొందించాం.. దానిని కూడా వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టి.. వారిని విడదీసి రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో కనీసం ఆ సీట్లు కూడా రావు. పేద ప్రజల అభివృద్ధికి బాటలు వేస్తోన్న సీఎం వైఎస్ జగన్‌కి మంచి పేరు వస్తోందన్న కుట్రతో సభ నుంచి వాకౌట్ చేశార’ అని మంత్రి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment