చినబాబు నారా లోకేష్‌తో (దొరగారు ఫేస్‌బుక్‌లో పెట్టుకున్న ఫొటో)
‘పోలీస్ కమిషనరా.. అయితే ఏంటి?.. సిటీకి సీపీలు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ చంటిగాడు లోకల్’.. 17 ఏళ్ల క్రితం ఓ సినిమాలో పేలిన ఈ పూరీ జగన్నాథ్ మార్కు డైలాగ్.. ఇప్పటికీ చాలామంది నోళ్లలో నానుతూనే ఉంది.ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. మన వైజాగ్ వరకు ఈ డైలాగ్ కాస్త మార్చి చెప్పుకోవాలేమో అనిపిస్తోంది.. అదెలా అంటే..పాతికేళ్లుగా సిటీకి సీపీలు వస్తున్నారు, పోతున్నారు.. అయితే ఏంటి?.. షాడో సీపీ మాత్రం ఒక్కడే.. ఇక్కడే..!కానీ సినీ డైలాగ్‌లో చెప్పినట్లు సదరు షాడో సీపీ లోకల్ కూడా కాదండోయ్.. సిక్కోలు నుంచి వచ్చి ఇక్కడే పాతుకుపోయారు..ఇంతకీ ఆ షాడో సీపీ ఎవరంటారా.. అతడే కేపీ.. అదేనండి కింజరాపు ప్రభాకర్..ప్రస్తుతం ఏసీపీగా ఉన్న ఈయన కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడుల సోదరుడే ఈయనగారు.ఎస్సైగా, సీఐగా, ఏసీపీగా.. పోస్టు ఏదైనా.. రెండున్నర దశాబ్దాలుగా ఇక్కడే బిచాణా వేసేశారు. బహుశా ఇంత అడ్డగోలుగా పాతుకుపోయిన పోలీసు అధికారి బహుశా తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే మరొకరు లేరేమో!
ఒకేచోట మూడేళ్ల సర్వీసు దాటిన ప్రభుత్వ అధికారులను బదిలీ చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలూ ప్రభాకర్ విషయంలో పని చేయలేదు.ఇటీవలే కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సహా చాలామంది బదిలీ అయినా.. మంత్రి సోదరుడు మాత్రం ఇక్కడే పాగా వేసేశారు.సరే.. వ్యక్తిగత అవసరాల దృష్ట్యా ఇలా పాతుకుపోయి.. తన పని తాను చూసుకుంటే ఎవరికీ ఇబ్బంది లేదు.కానీ సదరు ప్రభాకర్ మాత్రం పూర్తిస్థాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాదిరిగా పని చేస్తుండటమే వివాదాస్పదమవుతోంది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మంత్రులు, అధికార పార్టీ నేతల కుటుంబీకులు, రాజకీయ నాయకుల బంధువులు ప్రభుత్వ ఉద్యోగాలు చేయకూడదా..!?.. అయ్యో ఎందుకు చేయకూడదు.. మహా దర్జాగా చేసుకోవచ్చు.. కానీ తమ ఉద్యోగ ధర్మాన్ని, రాజకీయాలతో ముడిపెట్టకుండా చేయాలి. రాజకీయాలకతీతంగా పనిచేయాలి. అలా పని చేస్తున్నవారెందరో ఉన్నారు. కానీ రాజకీయాలతో అంటకాగుతూ.. అధికార పార్టీ మనిషిగా ముద్ర వేసుకుని మరీ హల్‌చల్ చేసే ఏసీపీ కింజారపు ప్రభాకర్ వంటి కొందరు కూడా ఉంటారు.
కింజారపు ప్రభాకర్‌కు నిబంధలేమిటి?..
ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల బదిలీలకు ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 10లోగా ఎన్నికల బదిలీలు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. ఏ పోస్టులో పనిచేసినా మూడేళ్ల పాటు జిల్లాలో పనిచేసిన వారికి స్థానచలం తప్పదని, అదేవిధంగా 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన అధికారులను సైతం బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఆ మేరకు బదిలీల ప్రక్రియను గడువులోగా ముగించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరేళ్లుగా ఇక్కడే పనిచేసిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను ప్రభుత్వం పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీ చేసింది. ఇక జిల్లా స్థాయిలో కూడా బదిలీలకు అర్హులైన అధికారుల జాబితాలను సిద్ధం చేసి సీసీఎల్‌ఏ, పంచాయతీరాజ్ కమిషనర్‌లకు పంపించారు. అదేవిధంగా పోలీసుశాఖ పరిధిలో మూడేళ్లకుపైగా నగరంలోనూ, జిల్లాలోనూ పనిచేస్తున్న సీఐలు, ఏసీపీలను కూడా బదిలీ చేశారు. కానీ ఒక్క కింజారపు ప్రభాకర్‌ను మాత్రం మినహాయించేశారు. మూడున్నరేళ్ళుగా ట్రాఫిక్ ఏసీపీగా ఇక్కడే తిష్ఠ వేసిన ఆయన్ను సరిగ్గా నెల కిందట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా బదిలీ చేశారు. నిబంధనల ప్రకారం జిల్లా దాటించాలని ఉన్నా... కీలకమైన స్పెషల్ బ్రాంచ్‌కు వేయడం చూస్తేనే.. మంత్రి సోదరుడి విషయంలో నిబంధనలు ఎలా నీరుగారిపోయాయో అర్ధమవుతుంది.
షాడో సీపీగా హల్‌చల్
తెలుగుదేశం ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ కీలకంగా ఉంటూ చీటికీ మాటికీ అధికారులపై, ప్రజలపై నోరేసుకుని పడిపోయే మంత్రిగా అచ్చెన్నాయుడుకు పేరుంది. అలాంటి అచ్చెన్నాయుడికి స్వయానా సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడుకు చిన్నాన్న... ఇంతకంటే బ్యాక్‌గ్రౌండ్ ఏం కావాలి?!.. అందుకే ప్రభాకర్ ఏం చెబితే అదే పోలీసుశాఖలో నడిచిపోతుంది.. కాదు కాదు పరిగెడుతుందనే చెప్పాలి. ఈ బ్యాక్ గ్రౌండ్ చూసుకునే సదరు ప్రభాకర్ పోలీస్ కమిషనర్ సహా పై అధికారులెవ్వరినీ లెక్కచేయని తనంతో వ్యవహరిస్తూ మంత్రులు, రాజకీయ నేతలతో మాత్రం సన్నిహితంగా ఉంటుంటారు. ఇక ప్రభాకర్ ఇటీవలి కాలంలో స్పెషల్ బ్రాంచ్‌లోకి మారిన తర్వాత షాడో సీపీగా హల్‌చల్ చేస్తున్నారన్న వాదనలు స్వయంగా పోలీసు అధికారవర్గాల నుంచే వినిపిస్తున్నాయి.
ప్రతిపక్ష పార్టీ నేతల కదలికలపై కన్ను
తెలుగుదేశం నేతలతో ఏసీపీ కింజారపు ప్రభాకర్ ఎంత సన్నిహితంగా ఉంటారనేది ఎవరూ చెప్పనక్కరలేదు. ఆయన ఫేస్ బుక్ చూసినా అర్థమైపోతుంది. టీడీపీ కార్యకర్త మాదిరి నారా లోకేష్‌బాబుతో ఫొటోలు, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, శిద్ధా రాఘవరావు సహా పలువురు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో దిగిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టుకుని హల్‌చల్ చేయడం చర్చనీయాంశమవుతోంది.
సరే.. ఇదంతా ఆయన వ్యక్తిగతం అనుకున్నా..
ఆయన ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల కదలికలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి టీడీపీ పెద్దలకు పంపించడం వివాదాస్పదమవుతోంది. నిబంధనలకు విరుద్ధమైనా.. ఓ విధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు చేసే పనిని ప్రభాకర్ నెత్తికెత్తుకోవడం, కేవలం టీడీపీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయడమే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
రెండు మూడేళ్లు మినహా..
♦ 1991 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఈయన విశాఖ నగరంలోని దాదాపు అన్ని పోలీస్‌స్టేషన్లతో పాటు రూరల్ జిల్లా పరిధిలోని జీకేవీధి, అనకాపల్లి స్టేషన్లలోనూ ఎస్సైగా పనిచేశారు.
♦ 2002లో సీఐగా పదోన్నతి పొందిన ప్రభాకర్ మొదట కంచెరపాలెం స్టేషన్‌లో.. తర్వాత ట్రాఫిక్, విజిలెన్స్ విభాగాల్లో విధులు నిర్వర్తించారు.
♦ 2011లో డీసీపీగా పదోన్నతి పొందిన ఈయన కొంతకాలం హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. 2014లో విశాఖలోని పోలీసు శిక్షణాకేంద్రం ఏసీపీగా తిరిగి వచ్చేశారు. 2014 నవంబర్ నుంచి ట్రాఫిక్ ఏసీపీగా చేసిన ప్రభాకర్ ఈ మధ్యనే స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. అంటే మధ్యలో కొద్ది కాలం మినహా దాదాపు 25 ఏళ్లపాటు విశాఖలోనే పనిచేసిన అధికారిగా కింజారపు ప్రభాకర్ ఓ రికార్డు సృష్టించారనే చెప్పాలి.
సిక్కోలు ఖాకీ బదిలీలన్నీప్రభాకర్ కనుసన్నల్లోనే
ఇక సొంత జిల్లా, తమ్ముడు మంత్రిగా, అన్న కొడుకు ఎంపీగా ఉన్న సిక్కోలులో పోలీసుల బదిలీలన్నీ స్వయానా ప్రభాకరే చూస్తుంటారనేది పోలీసు వర్గాలే లోపాయికారీగా అంగీకరిస్తున్న వాస్తవం. ఎస్సైలు మొదలు.. డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీల వరకు అన్నీ ప్రభాకర్ కనుసన్నల్లోనే నడుస్తుంటాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్తగా సిక్కోలుకు అను‘కూల’ అధికారులను పోస్టింగ్‌లు ఇప్పించడంలో ప్రభాకర్ చక్రం తిప్పారని అంటున్నారు. 1991 బ్యాచ్‌కే చెందిన వివేకానంద, కృష్ణవర్మ, ఏవీ రమణలను శ్రీకాకాళానికి బదిలీ చేయించడంలోనూ ప్రభాకర్ ప్రమేయం ఉందన్న వాదనలు పోలీసువర్గాల్లోనే వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment