కైకలూరు (కృష్ణాజిల్లా) : పార్టీని హోల్‌సేల్‌గా అమ్మేసుకుని కాంగ్రెస్ చెంతకు చేరిన చిరంజీవికి సీఎం చంద్రబాబును రాజీనామా చేయమనే అర్హత లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సిహెచ్.అయ్యన్నపాత్రుడు విమర్శించారు. కృష్ణాజిల్లా కైకలూరులో శనివారం పుష్కర యాత్రికులకు ఎంపీ మాగంటి బాబు ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పుష్కరాల మొదటి రోజు జరిగిన ఘటన గురించి చిరంజీవి టీవీల ముందు మాట్లాడారే కానీ, రాజమండ్రి వచ్చి బాధితులను పరామర్శించలేదన్నారు. అనంతపురం జిల్లాలో పర్యటన చేస్తున్న రాహుల్ గాంధీ.. ఉపాధి హామీ పథకంపై విమర్శలు చేయడం తగదన్నారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ పాలనలోనే ప్రారంభించారనే విషయం తెలుసుకోవాలన్నారు.
అప్పట్లో ఆ పార్టీ నాయకులకు ఉపాధి హామీ పథకం ఆర్థిక వనరుగా మారిందన్నారు. తాను వచ్చిన తర్వాత కేంద్రంతో మాట్లాడి ఈ నిధులతో గ్రామాల్లో స్థిరాస్తులను పెంచడానికి కృషి చేశానన్నారు. డ్వాక్రా సంఘాలను రాహుల్ తల్లిదండ్రులు ఏర్పాటు చేయలేదని, చంద్రబాబు రూపొందించారని తెలుసుకోవాలన్నారు. ప్రతిపక్ష నేత జగన్ మంచి సూచనలు చేస్తే తప్పక పరిశీలిస్తామన్నారు. రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.16 వేల కోట్లు రానున్నాయని చెప్పారు. వాటిలో సగం నిధులు తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌లకు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మేజర్ పంచాయతీకి చెత్త సేకరణ ట్రాక్టర్‌ను అందిస్తామన్నారు.
'పార్టీని అమ్ముకున్నవారు విమర్శించడం విడ్డూరం'
Published Sat, Jul 25 2015 8:00 PM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM
Advertisement
Advertisement