చాగలమర్రి మండలంలో భద్రత లేకుండా తిరుగుతున్న అఖిలప్రియ
సాక్షి, ఆళ్లగడ్డ: మంత్రి అఖిలప్రియ అలకబూనారు. తన అనుచరుల ఇళ్లల్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారన్న కోపంతో గన్‌మెన్‌లను వెనక్కి పంపించి, నిరసన వ్యక్తం చేస్తున్నారు. తనకు రక్షణగా వస్తున్న స్థానిక పోలీసులను సైతం వెంట రావద్దని పంపించేశారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఆళ్లగడ్డలోని వివిధ పార్టీల ద్వితీయ శ్రేణి నేతల ఇళ్లల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. మంత్రి అఖిలప్రియ అనుచరుల ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. దీంతో సదరు వ్యక్తులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆమె స్థానిక పోలీసులను అడగ్గా.. పై అధికారుల ఆదేశాల మేరకు అనుమానమున్న అందరి ఇళ్లల్లోనూ సోదాలు చేశామని చెప్పారు. తన వర్గీయుల ఇళ్లపైనే ఆకస్మిక దాడులు నిర్వహిస్తారా? అంటూ గురువారం రాత్రి గన్‌మెన్‌లను పిలిచి.. వెళ్లిపోవాలని అఖిలప్రియ ఆదేశించారు.
గన్‌మెన్‌లు ఉన్నతాధికారులకు చెప్పగా, వారు మంత్రితో మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అయినప్పటికీ శాంతించని మంత్రి ముందు గన్‌మెన్‌లు బయటకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తోడెండ్లపల్లి, రుద్రవరం మండలం నరసాపురం గ్రామాల్లో సభల్లో మంత్రి అఖిలప్రియ పాల్గొన్నారు. అనంతరం ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న మంత్రికి భద్రత కల్పించేందుకు స్థానిక ఎస్‌ఐలు, పోలీసులు వెంట రావడంతో మంత్రి మరోసారి మండిపడ్డారు. అన్ని పార్టీలకు చెందిన అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లల్లో సాధారణ తనిఖీలు నిర్వహించారు. అధికార పార్టీ నేతలు మాత్రమే అసంతృప్తితో ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment