
బొబ్బిలి: ప్రతిపక్ష నేత చంద్రబాబే స్వయంగా పుకార్లను ప్రచారం చేస్తూ.. వాటిని నిజం చేసేందుకు ఆపసోపాలుపడుతున్న తీరు చూస్తుంటే నవ్వొస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో వార్డు సచివాలయాన్ని ఆదివారం ప్రారంభించాక జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకొచ్చిన వంద రోజుల్లోనే లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని తట్టుకోలేని టీడీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించినవారిని వేదికపైకి పిలిచి వారితో మాట్లాడించారు.
సీతానగరం మండల కేంద్రానికి చెందిన శాంతికుమారి మాట్లాడుతూ తాను గతంలో ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా.. డబ్బులు ముట్టజెప్పలేకపోయినందున ఏ ఉద్యోగం రాలేదని, కానీ ఇప్పుడు ఎవరికీ డబ్బులు చెల్లించకుండానే సచివాలయ ఉద్యోగం వచ్చిందని ఆనందంగా చెప్పారు. తెర్లాం మండలం నందబలగకు చెందిన సత్యవతి మాట్లాడుతూ తాను ఎమ్మెస్సీ చదివానని.. గత ప్రభుత్వ హయాంలో డబ్బులు కట్టి ఉద్యోగాలు చేస్తున్న వైనాన్ని చూసి.. ఆ స్థోమత లేని తనకు ఈ జన్మకు ఉద్యోగం రాదనుకున్నానని, అయితే ప్రభుత్వం మారాక సచివాలయ ఉద్యోగానికి దరఖాస్తు చేసి దానిని సాధించానని ఉద్వేగంతో చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన అప్పలనాయుడు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment