
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి రహిత పాలనకు నడుం బిగించారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని.. అధికారులు ప్రజాప్రతినిధులను కలుపుకుపోవాలన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ల వర్క్‌షాప్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలపై ప్రభుత్వం తొలి రోజు నుంచే దృష్టి సారించిందని గుర్తుచేశారు. త్వరలో వార్డు సేవకులను ప్రభుత్వం నియమించబోతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో వార్డు సేవకులను ఎలా వినియోగించుకోవాలనే దానిపై చర్చించడమే ఈ వర్క్‌షాప్ ఉద్దేశమని పేర్కొన్నారు.
అదేవిధంగా సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చించాలని అధికారులకు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మంచి పాలన అందించాలని కోరారు. మంచి నీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పరిస్థితులపై పూర్తిగా అధ్యయనం చేయాలని.. ఇబ్బందులను దాచిపెట్టకుండా, ఉన్నది ఉన్నట్టు చెప్పాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.