
దేవినేని తీరుతో విస్తుపోయిన ఢిల్లీ మీడియా
న్యూఢిల్లీ: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీరు చూసి ఢిల్లీ మీడియా ముక్కున వేలేసుకుంది. దేశంలో ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) పథకం కింద చేపడుతున్న ప్రాజెక్టులు, నదుల అనుసంధానంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన నిన్న (శుక్రవారం) నిర్వహించిన మేథోమథనంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వచ్చారు. పంజాబ్, యూపీ, హరియాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఆ భేటీ అనంతరం మంత్రి ఉమా ఏపీ భవన్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రితో సమావేశం వివరాలను వెల్లడిస్తారని ఎదురుచూసిన మీడియా యావత్తూ.. ఆయన ఏకబిగిన 33 నిమిషాల పాటు మాట్లాడింది విని విస్తుపోయింది. విలేకరుల సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం సమయాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడానికే కేటాయించారు.
‘రాష్ట్రంలో 420 పాలన అని జగన్ చెబుతుంటే అందరూ నవ్వుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న వ్యక్తి జగన్. గత మూడేళ్ల కాలంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక్క సలహా కూడా ఇవ్వలేదు’ అంటూ విమర్శించారు. అసలు విషయం చెప్పకుండానే సమావేశాన్ని ముగించి బయలుదేరారు. దీంతో అసలు ఢిల్లీ వచ్చిందెందుకో చెప్పాలంటూ మంత్రిని మీడియా ప్రతినిధులు కోరారు.
అప్పుడు మళ్లీ కుర్చీలో కూర్చున్న దేవినేని.. జలమంథన్–4 సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చానని, ఈ సమావేశంలో పీఎంకేఎస్‌వై, నాబార్డు కింద చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిపై, నదులు అనుసంధానంపై చర్చించినట్టు చెప్పి వెళ్లిపోయారు. రాష్ట్రంలో ఎక్కడ, ఎప్పుడు మాట్లాడినా సబ్జెక్టుని మరిచి ప్రతిపక్ష నేతపై ఆరోపణలు గుప్పించడమే పనిగా పెట్టుకునే మంత్రి దేవినేని.. ఢిల్లీలో సైతం ఆదే తీరును ప్రదర్శించడం విమర్శలకు తావిచ్చింది.