సంప్రదింపులతో జలవివాదాల పరిష్కారం : మంత్రి ఉమ
నూజివీడు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలను సంప్రదింపులతో పరిష్కరించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సన్నాహాలు చేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఆలోచనారహితంగా విభజించడం వల్ల రాజధాని సమస్యతో పాటు సాగు, తాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు.
రాష్ట్రంలో భూగర్భ జలాలను మెరుగుపర్చడానికి, నదుల్లోని నీరు సముద్రంలో కలవకుండా ప్రతి నీటిచుక్కను సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కృష్ణాడెల్టాలో సాగు, మంచినీటి కొరతను ఎదుర్కొనేందుకు గాను ప్రస్తుతం రోజుకు ఆరువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆందోళనతో నీటి విడుదలను ఆపేశారని, దీనిపై కేంద్ర జలసంఘం చైర్మన్ పాండ్యాతో సంప్రదింపులు జరిపి నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.