'రౌడీలా మాట్లాడుతున్న మంత్రి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి బలవంతపు భూసేకరణ తప్పు అయినందునే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధర్నాచేశారని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కృష్ణా జిల్లాలో జగన్ చేపట్టిన రెండు ధర్నాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ఏమైనా సంజీవనా అని చంద్రబాబు వ్యాఖ్యానించటం తగదన్నారు. ప్రత్యేక హోదా అంటూ ప్రగల్బాలు పలికి.. నేడు చంద్రబాబు తోక ముడిచారని వ్యాఖ్యానించారు.
తాట తీస్తామంటూ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రాష్ట్ర మంత్రులు, టీడీపీ నేతలు వీధి రౌడీలలా మాట్లాడుతున్నారు. మీ తాట తీస్తాం అంటూ కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి మాట్లాడారు. ఇది సబబేనా? మంత్రిగా ఉన్న నాయకుడు ఇలాంటి భాష మాట్లాడటడమేంటి. చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. డబ్బులిచ్చి పోలవరాన్ని వైఎస్ జగన్ నిలిపి వేయించారంటూ అన్యాయంగా ఆరోపణలు చేస్తున్న మంత్రులు ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. ఆడలేక మద్దెల ఓడు చందంగా మంత్రులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టమని ప్రజలు మీకు అధికారాన్ని ఇవ్వలేదు. ఒక్కోపూట ఒక్కో మాట మాట్లాడుతున్న మిమ్మల్ని ప్రజలు ఎలా నమ్ముతారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటిని అమలు చేయని మీపై ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలో చెప్పాలి' అని బొత్స డిమాండ్ చేశారు.
'రాష్ట్రంలో ఎవరైనా రాజద్రోహానికి పాల్పడితే ఉపేక్షించం అంటున్నారు.. ఎవరండి ద్రోహానికి పాల్పడింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించినట్లుగా రాజద్రోహానికి పాల్పడింది టీడీపీ వాళ్లు కాదా. గతంలో ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనను గద్దె దింపింది మీరు కాదా? కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలద్రోసే యత్నం చేయడం రాజద్రోహం కాదా' అని బొత్స ప్రశ్నించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని అమలు చేయకపోతే ప్రజల పక్షాన పోరాడే హక్కు ప్రతిపక్ష పార్టీకి ఉంటుందన్నారు. అధికార పార్టీ నేతల్ని ప్రజల మధ్యన నిలబెట్టి వారి తప్పుల్ని ఎత్తిచూపుతామని చెప్పారు.