
సాక్షి, విశాఖపట్నం: విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడల్లో రాణిస్తే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన గురువారం విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ స్టేట్ క్యారమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 9 నుంచి 12 వరుకు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 50 సంవత్సరాల వేడుకలను విశాఖ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో జరుపుతామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి క్యారమ్స్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ప్రపంచంలో ఎవరికీ లేని గౌరవం క్రీడాకారులకు ఉంటుందన్నారు. పార్టీలకతీతంగా క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. క్రీడలకు సహకారం అందించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. విశాఖలో స్పోర్ట్స్ హబ్ నిర్వహణ పూర్తిస్థాయిలో కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని మంత్రి కృష్ణదాస్ వెల్లడించారు.