సాక్షి, ప్రతినిధి, నెల్లూరు: జిల్లా మంత్రి పి.నారాయణ వైఖరిపై నెల్లూరు నగర మేయర్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. నగరంలో మంత్రి ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులతోపాటు నగరానికి చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు.
మేయర్ మాత్రం ముఖం చాటేయడం గమనార్హం. మంత్రి నారాయణ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని మేయర్‌కు తెలియజేసినప్పటికీ ఆయన గైర్హాజరయ్యారు. ఆదివారం తెల్లవారుజామున మంత్రి నారాయణ నెల్లూరుకు చేరుకున్నారు. ఉదయం మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి ఇంట్లో అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం నవాబుపేట ఆర్‌ఎస్సార్ స్కూల్ ప్రాంగణంలో వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా, నగర నేతలు హాజరయ్యారు. ఆ సమయంలో మేయర్ నగరంలో ఉన్నప్పటికీ మంత్రి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపై ఆ పార్టీ నేతలు చర్చించుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే మేయర్ మంత్రి కార్యక్రమాలకు గైర్హాజరయ్యారని అనుకుంటున్నారు. మేయర్ మధ్యాహ్నం వరకు నగరంలో ఉన్నప్పటికీ తాను హైదరాబాద్‌లో ఒక వివాహానికి హాజరుకావల్సి ఉండగా రాలేనని తప్పించుకున్నట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మంత్రి ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరిన మేయర్ ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిగా మారారని నాయకులు అంటున్నారు.
రాజకీయంగా తనకు జన్మనిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరినప్పటికీ కార్పొరేషన్‌కు ఒక పైసా నిధులు కూడా ప్రభుత్వం నుంచి రాకపోవడం అజీజ్ అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. కార్పొరేషన్ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి లేకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శల దాడిని ఎదుర్కుంటున్నానని మేయర్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నారని తెలిసింది. అధికార పార్టీలో చేరితే అభివృద్ధికి దోహదపడుతుందన్న తన అభిప్రాయానికి భిన్నమైన పరిస్థితులను అజీజ్ జీర్ణించుకోలేకపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ చక్రధర్‌బాబు విషయంలో మంత్రి చొరవ తీసుకున్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వడంలేదనేది మేయర్‌ను ఇబ్బందికి గురిచేస్తుంది.
మంత్రి వైఖరిపై మేయర్ అసంతృప్తి
Published Mon, Dec 29 2014 2:24 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement