నెల్లూరులో పేపర్ లీకేజి నిజమే: మంత్రి
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారంలో ఏపీ మంత్రులు, వియ్యంకులు అయిన నారాయణ, గంటా శ్రీనివాసరావు భిన్న ప్రకటనలు చేశారు. అసలు పేపర్ లీకేజి అన్నదే లేదని మంత్రి నారాయణ చెబుతుండగా.. నెల్లూరులో పేపర్ లీకేజి వాస్తవమేనని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. నెల్లూరులో పదో తరగతి పరీక్ష జరుగుతుండగా మధ్యలో ప్రశ్నపత్రం బయటకు వచ్చిందని, అలా రావడం తప్పేనని ఆయన అంగీకరించారు. ఆ విషయం తెలియగానే తాము విచారణకు ఆదేశించామని చెప్పారు. నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని, అందులో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవని గంటా శ్రీనివాసరావు అన్నారు.
అయితే పదో తరగతి పరీక్షల్లో ఎక్కడా పేపర్ లీక్ కాలేదని మంత్రి నారాయణ అన్నారు. పేపర్ లీక్ కాలేదని అధికారులు తేల్చారని చెప్పారు. జంబ్లింగ్ విధానంతో ఒక పాఠశాల విద్యార్థులు అనేక చోట్లకు వెళ్తారని ఆయన అన్నారు. అందువల్ల ఎవరో ఒకరు లబ్ధి పొందడం అనే ప్రసక్తి ఉండదన్నారు. కానీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం మాత్రం నెల్లూరు నారాయణ హైస్కూలులోనే పేపర్ లీకేజి జరిగినట్లు వెల్లడి కావడం గమనార్హం. నెం. 4238 సెంటర్ అంటూ పక్కాగా నివేదిక ఇవ్వడం, ఆ నివేదికను ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో బయటపెట్టడంతో సర్కారుకు పచ్చివెలక్కాయ గొంతులో పడినట్లు అయ్యింది. దానికి తగ్గట్లుగానే మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా లీకేజిని నిర్ధారించడంతో ఇక ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకుంటున్నారు.