కియా ప్రతినిధులతో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు, ఐటీ సంస్థలు తరలిపోతున్నాయంటూ కొంతమంది దురుద్దేశంతో పనిగట్టుకుని దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 15వ ఆటో ఎక్స్‌పోను ఆయన శుక్రవారం ప్రారంభించారు. అలాగే గ్రేటర్ నోయిడాలో నిర్వహిస్తున్న ఆటోమోటార్ షో–2020ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. కియా మోటార్స్ తమిళనాడుకు వెళుతోందనే వార్త అవాస్తవమని ఆ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కూడా చెప్పారన్నారు. అంతేకాకుండా తరలింపు వార్తను ఖండిస్తూ కియా మోటార్స్ ఎండీ కూడా ప్రకటన ఇచ్చారని గుర్తు చేశారు. కియా ఫ్యాక్టరీ రెండో మోడల్‌ను కూడా మార్కెట్లోకి తెస్తోందని, జూన్ లేదా జూలైలో మూడో మోడల్‌ను కూడా అందుబాటులోకి తేనుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆ సంస్థ గట్టి నమ్మకంతో ఉందని తెలిపారు. అలాగే కొన్ని ఐటీ సంస్థలకు తాము నోటీసులు ఇచ్చినట్టు, దీంతో అవి వేరే నగరాలకు వెళ్లిపోతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని కూడా తీవ్రంగా ఖండించారు. కియా మోటార్స్ తరలిపోతోందని చంద్రబాబు అంటున్నారని, ఎందుకు వెళ్లిపోతోందో, ఎక్కడికి వెళ్లిపోతోందో ఆయన వివరణ ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు వివిధ సంస్థల ఆసక్తి
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక ఆటోమొబైల్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. న్యూఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో–2020 సందర్భంగా దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థల ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టాటా మోటార్స్ సంస్థ ప్రతినిధులు కంపెనీ విస్తరణ కార్యక్రమాలకు ఏపీని ఎంచుకుంటామని హామీ ఇచ్చినట్టు మంత్రి వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, ఇందుకోసం రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రెనాల్ట్ ఇండియా సీఈవో వెంకటరామ మామిలపల్లె తెలిపారు. ఫోర్స్ ఇండియా, గ్రేట్ వాల్ మోటార్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. అనంతరం నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌తో సమావేశమై రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి ఆర్థిక సహకారమందిస్తామని అమితాబ్ హామీ ఇచ్చారు. ఈ సమావేశాల్లో పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం, సలహాదారు శ్రీధర్ లంక, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment