రాష్ట్ర మంత్రి వస్తున్నారంటే... మారుమూల పల్లెవాసుల్లో ఏదో తెలియని ఆశ. ఏమైనా ప్రకటిస్తారేమో... తమ సమస్యలు తీరుస్తారేమో... ఏవైనా వరాలు ఇస్తారేమో... ఇలా ఎవరైనా అనుకుంటారు. కానీ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాత్రం తూతూ మంత్రంగా పర్యటించారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఆస్పత్రుల్లో అసౌకర్యాలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి ఏమీ హామీ ఇవ్వలేదు. అనారోగ్యం పాలైనవారి గురించి ఆరా తీస్తారనుకున్నా... అవేమీ ఆయన పర్యటనలో చోటు చేసుకోలేదు.
జియ్యమ్మవలస/కురుపాం/గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలోని ఆస్పత్రులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. తొలుత ఆయన జియ్యమ్మవలసలోని పీహెచ్‌సీని పరిశీలించారు. గిరిజనుల ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుంటారని అంతా భావించినా ఆయన కేవలం ఆస్పత్రులనే తనిఖీ చేశారు. అసౌకర్యాలపై వాకబు చేశారు కానీ ఏవిధమైన నిర్ణయాన్నీ ప్రకటించలేదు. ఇక్కడి పీహెచ్‌సీలో సిబ్బంది కొరత ఉందనీ, డాక్టర్ సమయానికి రావట్లేదని సీపీఎం నాయకులు వినతిపత్రాన్ని అందించారు. ఈ తరుణంలో నిడగల్లుగూడ గ్రామానికి చెందిన బిడ్డిక అడ్డయ్య ‘ఓట్లకోసం వస్తారు...
కనీసం ఇళ్ల బిల్లులైనా మంజూరుచేయరు’ అంటూ నిష్టూరమాడగా... మంత్రి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నలే తమకు వస్తాయనీ... గతం కంటే ఎక్కువగానే ఇచ్చామని ఆయన్ను కసరుకున్నారు. అదే గ్రామానికి చెందిన మండంగి అభిరాం(11 నెలలు) తల్లి మతి స్థిమితం లేక పిల్లవాడిని విడిచిపెట్టేస్తే మండంగి సుమతి, వెంకటరావు దంపతులు ఆ బాబును పెంచుకుంటున్నారు.
రోడ్డు పక్కనే ఇల్లు ఉండడంతో వారిదగ్గరకు వెళ్లి బాబుకు అంగన్‌వాడీ సరుకులు అందుతున్నాయా అని ప్రశ్నించారు. ఎందుకు అనారోగ్యంగా ఉన్నాడని అడిగారు. అయితే ఆయనేమైనా సాయం చేస్తారేమోనని ఆశపడినా ఆయన వారి సమాధానం వినకుండానే వెళ్లిపోయారు. మంత్రి వస్తారని... తమ సమస్యలు చెప్పుకుందామనీ అనుకున్నా... ఆ అవకాశం రాలేదని కిరిగేషు, రావాడ గిరిజనులు తెలిపారు. గిరిజనాభ్యుదయసంఘ అధ్యక్షుడు ఆరిక సింహాచలం మాత్రం గిరిజన గ్రామాల్లోని సమస్యలపై ఓ వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలోనే కురుపాం ఆస్పత్రి దయనీయం
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న 1400 పీహెచ్‌సీల్లో అత్యంత దయనీయమైనది కురుపాం ఆస్పత్రేనని... ఏజెన్సీనుంచి రోగులు బారులు తీరుతున్నా సౌకర్యాలు లేక పోవడం బాధాకరమని మంత్రి వ్యాఖ్యానించారు. కురుపాం సీహెచ్‌సీలో రోగుల వద్దకు వెళ్లి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీసారు. దీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి కేంద్ర మంత్రిగా పనిచేసినా ఈ ఆస్పత్రిని పట్టించుకోకపోవడం శోచనీయమని పరోక్షంగా వైరిచర్ల కిశోర చంద్రదేవ్‌ను ఉద్దేశించి అన్నారు. ఈ ఆస్పత్రిలో అవసరమైన వైద్యులు లేకుండా అనవసరమైన విభాగాలకు వైద్యులు ఉన్నారని తెలిపారు. త్వరలోనే ఆసుపత్రిలో లేబర్‌రూమ్, చిన్నపిల్లల వైద్యులు, గైనిక్ వైద్యులను నియమించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో నలుగురు వైద్యులున్నా షిఫ్ట్ డూటీలతో అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండటంలేదని, వైద్యులకు క్వార్టర్స్ ఉన్నా అందులో ఉండట్లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఉన్న ఐటీడీఏ పీఓ లక్ష్మీషాను వారం రోజుల్లోగా ఆస్పత్రి క్వార్టర్స్‌ను సద్వినియోగంలోకి తేవాలని సూచించారు.
డాక్టర్ సస్పెన్షన్‌కు ఆదేశం
నిరుపయోగంగా ఉన్న క్వార్టర్స్ పునరుద్ధరిస్తే స్థానికంగా ఉంటారా అని మంత్రి కామినేని కురుపాం సీహెచ్‌సీ డాక్టర్ గౌరీశంకరరావును ప్రశ్నించగా తాము ఉండలేమని నేరుగా చెప్పడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. చిత్తశుద్ధితో పనిచేయకుంటే సెలవుపై వెళ్లి ప్రైవేటు వైద్యం చేసుకోండని హెచ్చరించారు.
మలేరియా కేసులు ఎక్కువే...
గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మంత్రి ఓపీ వివరాలు, మలేరియా కేసులు, ఆస్పత్రిలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన భద్రగిరి పీవో కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలో సుమారు 83 వేల కేసులు నమోదైతే 250 పాజిటివ్‌గా గుర్తించామనీ, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో సుమారు 81 వేల కేసులు నమోదవ్వగా 1200 పాజిటివ్‌గా గుర్తించామన్నారు. ఆసుపత్రుల్లో 24 గంటల పాటు రోగులకు వైద్య సేవలందించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ఏజెన్సీలో 80 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారనీ, దానిని అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామనీ చెప్పారు. ఈయన వెంట పార్వతీపురం ఐటీడీఏ పీవో లక్ష్మీషా, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో రవికుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహనరావు, పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, కురుపాం బీజేపీ ఇన్‌చార్జ్ నిమ్మక జయరాజు, మాజి ఎమ్మెల్యే వీ.టి.జనార్థన్‌థాట్రాజ్ స్థానిక అధికారులు పాల్గొన్నారు.
వచ్చారు... వెళ్లారు...
Published Thu, Jul 13 2017 3:20 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM
Advertisement
Advertisement