శిక్షణ కరదీపిక, నవరత్న మాలికను ఆవిష్కరిస్తున్న మంత్రి ముత్తంశెట్టి, ఎమ్మెల్యే అదీప్‌రాజ్
సాక్షి, పెందుర్తి(విశాఖపట్టణం) : రాష్ట్రంలో అవినీతిలేని పాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర్ట పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. త్వరలో బాధ్యతలు తీసుకోనున్న గ్రామ వలంటీర్లు పారదర్శకంగా పని చేసి ప్రజల మన్ననలు అందుకోవాలని సూచించారు. టీవోటీలు వలంటీర్లకు ఆ దిశగా చక్కటి దిశానిర్దేశం చేయాలన్నారు. పెందుర్తి లోని డీఆర్‌డీఎ మహిళా ప్రగతి కేంద్రంలో శుక్రవారం గ్రామ వలంటీర్లకు శిక్షణ అందించనున్న జిల్లాస్థాయి టీవోటీలకు రెండు రోజుల శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వలంటీర్లకు అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు.
వారికి కేటాయించిన 50 కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల అవగాహన కలిగించి కుల, మత, వర్గ తేడాలు లేకుండా, రాజకీయాలకు అతీతంగా సంక్షేమపథకాలు అందేలా చూడాల్సి ఉంటుందన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గ్రామ సచివాలయానికి చేరవేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు. వలంటీర్లు అవినీతికి పాల్పడితే జిల్లాస్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని అక్కడ న్యాయం జరగకపోతే స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షించే రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని దాన్ని అందరూ సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అందరం పని చేయాలని ఆకాంక్షించారు.
పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్‌రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. గ్రామాల అభివృద్ధిలో వలంటీర్ల పాత్ర అంత్యంత కీలకమన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. గ్రామ వలంటీర్ల శిక్షణ కరదీపిక, నవరత్న మాలిక కరదీపికను మంత్రి, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ–2 ఎం.వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈవో రమణమూర్తి, డీపీవో కృష్ణకుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తిరుపతిరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు జయప్రకాష్, డీఈవో లింగేశ్వరరెడ్డి, డీఆర్‌డీఎ ఇన్‌చార్జి పీడీ రామ్మోహనరావు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment