ఆ వంశానికి ఎవరూ ఎదురెళ్లలేరు : మంత్రి పల్లె
అమరావతి : నందమూరి వంశానికి ఎవరూ ఎదురెళ్లలేరని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలక్రిష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు 100 శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. మినహాయింపును ఎవరైనా వ్యతిరేకించారా అని మీడియా ప్రశ్నించగా, నందమూరి వంశానికి ఎవరూ ఎదురెళ్లలేరని బదులిచ్చారు. అంత ధైర్యం ఎవరికైనా ఉందా అని వ్యాఖ్యానించారు. రుద్రమదేవి సినిమాకు దరఖాస్తు ఆలస్యంగా వచ్చిందని.. అందుకే మినహాయింపు ఇవ్వలేదని వివరించారు.
గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను రాయితీ కల్పించటంపై కేబినెట్లో చర్చకు వచ్చిన సమయంలో తాను ఉండనంటూ మంత్రి యనమల రామకృష్ణకు బాధ్యతలు అప్పగించి సీఎం చంద్రబాబు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. బుధవారం ఏపీ మంత్రివర్గం సమావేశంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. బాలకృష్ణ నటించిన ఈ సినిమాకు ఎలాంటి జీవో లేకుండానే పన్ను రాయితీ ఇవ్వటంపై హైకోర్టు వివరణ కోరిన విషయం విధితమే.
ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలపైనా మంత్రివర్గం చర్చించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి.. ఆందోళనలకు ఇది సమయం కాదని అన్నారు. ఇది అభివృద్ధిని వ్యతిరేకించే చర్య అని పేర్కొన్నారు. అసెంబ్లీ భవనం ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించాలని నిర్ణయించారు. అదేవిధంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కు 638ఎకరాలు కేటాయిస్తూ తీర్మానించింది. అనంతపురం జిల్లాలో 500మెగావాట్లా సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ కు 4018ఎకరాల భూమి కేటాయించాలని నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరగకుండా విశేష ఉపగుత్తేదారు అయిన ఎల్ అండ్ టీ సంస్థకు రూ.95 కోట్లు ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.