హవ్వ.. మంత్రిపై ఫిర్యాదా?
యర్రగొండపాలెం : మంత్రి మంత్రి శిద్దా రాఘవరావుపై సీఎం చంద్రబాబుకు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బూదాల అజితారావు ఫిర్యాదు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ మన్నె రవీంద్ర అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు పలువురు టీడీపీ నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా అజితారావుపై అవినీతి ఆరోపణలు చేశారు. ఈ నెల 2వ తేదీన స్థానికి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన అజితారావు.. రేషన్ షాపులు మంత్రి చెప్పినవారికి ఇవ్వడం ఏమిటని, తాను చెప్పిన వారికి ఇవ్వాలని తహశీల్దార్‌ను ప్రశ్నించడం విడ్డూరమన్నారు.
నియోజకవర్గంలో పార్టీని అభాసుపాలు చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆమెపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆది నుంచి పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. రేషన్ షాపుల కోసం డబ్బులు వసూలు చేస్తూ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పుల్లలచెరువు మండల పరిషత్ ఓటమికి కారణమైన వ్యక్తి సోదరుడిని మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా నియమించుకోవడం టీడీపీని, కార్యకర్తలను దెబ్బ తీయడమేనని విమర్శించారు.
నియోజకవర్గంలో విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు 16 ఉండగా 22 పోస్టులకు ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు చొప్పున అజితారావు వసూలు చేసింది నిజం కాదా.. అని ప్రశ్నించారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సమావేశంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కామేపల్లి వెంకటేశ్వర్లు, పార్టీ పుల్లలచెరువు మండల అధ్యక్షుడు శనగ నారాయణరెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా కోశాధికారి గోళ్ల వెంకటసుబ్బారావు, నాయకులు వడ్లమూడి లింగయ్య, మేడికొండ లక్ష్మీనారాయణ, తోట మహేష్, కొత్తమాసు సుబ్రహ్మణ్యం, షేక్ మహ్మద్ఫ్రీ, వై.లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు.