సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంత్రి పదవికి రాజీనామా చేశారు. గురువారం రాత్రి రాజీనామా లేఖను వ్యక్తిగత సిబ్బంది ద్వారా సీఎం క్యాంపు కార్యాలయానికి పంపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో శాసనసభ వ్యవహారాల శాఖను తన నుంచి తప్పించడాన్ని అవమానంగా భావించిన శ్రీధర్‌బాబు కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో కొనసాగకూడద ని నిర్ణయించుకున్నారు. తెలంగాణ మంత్రులతోపాటు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు కూడా రాజీనామా విషయంలో తొందరపడొద్దని ఆయనకు సూచించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ గురువారం ఒకవైపు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, జానారెడ్డితో మాట్లాడి రాజీనామా చేయకుండా చూడాలని సూచించారు. మరోవైపు ఆయనే నేరుగా శ్రీధర్‌బాబుకు ఫోన్‌చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని బుజ్జగించారు. సీఎంతో తాను మాట్లాడతానని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని పేర్కొన్నారు.
శ్రీధర్‌కు నచ్చజెప్పడానికి యత్నించిన కుంతియా..
మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు గురువారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి సహాయకుడు రామచంద్ర కుంతియా.. శ్రీధర్‌బాబును పిలిపించుకుని మాట్లాడారు. రాజీనామా చేస్తే తెలంగాణ మంత్రులపై ఒత్తిడి పెరుగుతుందని, తద్వారా విభజన అంశం పక్కదోవపట్టే ప్రమాదముందని కుంతియా అభిప్రాయపడ్డట్లు తెలిసింది.
‘ఇప్పటి వరకు తెలంగాణ విషయంలో సమష్టిగా ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. టీ మంత్రులంతా ఏకతాటిపై ఉన్నారనే సంకేతాలను ప్రజల్లోకి పంపగలిగాం. ఇప్పుడు నువ్వు రాజీనామా చేస్తే.. మిగిలిన వారందరిపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే వారిలో కొందరు రాజీనామా చేసే అవకాశాలు ఏమాత్రం లేవు. కాబట్టి ఈ అంశంతో మంత్రుల మధ్య భేదాభిప్రాయాలు, పొరపొచ్చాలు పెరిగే ప్రమాదముంది. అందుకే తొందరపడొద్దు’ అని జానారెడ్డి హితవు పలికినట్లు సమాచారం. తరువాత అందరూ కలిసి ఆమన్‌గల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడి నుంచి వచ్చాక జానారెడ్డి మరోదఫా మంతనాలు జరిపారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా శ్రీధర్‌బాబుతో చర్చించారు. అవసరమైతే వాణిజ్య పన్నులతోపాటు పౌరసరఫరాల శాఖను వదులుకోవాలే తప్ప పదవికి రాజీనామా చేయొద్దని సూచించారు. తెలంగాణ విషయంలో దీర్ఘకాలిక లక్ష్యం కోసం మంత్రిగా కొనసాగక తప్పదని కోరడంతోపాటు మీడియా సమావేశంలోనూ డీఎస్ ఇదే విషయాన్ని చెప్పారు. అసెంబ్లీలో విభజన ప్రక్రియ అంశం ముగిసే వరకు సంయమనం పాటించాలని కోరారు.
కరీంనగర్ నేతలతో సమావేశం..
సాయంత్రం కరీంనగర్ జిల్లా నేతలతోనూ శ్రీధర్‌బాబు సమావేశం నిర్వహించి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌తోపాటు డీసీసీ అధ్యక్షుడు రవీందర్‌రావు, జిల్లా ముఖ్య నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రాజీనామాపై పునరాలోచించుకోవాలని కొందరు సూచించినప్పటికీ తన మనసు మాత్రం రాజీనామా చేయాలనే చెబుతున్నందున ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఆ తరువాత సీమాంధ్ర మంత్రులు పి.బాలరాజు, కొండ్రు మురళీమోహన్ శ్రీధర్‌బాబు నివాసానికి వచ్చి ఆయనతో గంటకుపైగా మంతనాలు జరిపారు. మంత్రి జి.ప్రసాద్‌కుమార్ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. అయినప్పటికీ శ్రీధర్‌బాబు మెత్తపడకపోవడంతో ఆయా నేతలంతా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి బొత్స కూడా శ్రీధర్‌బాబుకు ఫోన్ చేసి రాజీనామా విషయంలో పునరాలోచించుకోవాలని కోరారు.
వెంటనే ఆమోదించండి..
పార్టీ ముఖ్య నేతలందరి బుజ్జగింపులతో తొలుత మెత్తపడ్డట్లు కన్పించిన శ్రీధర్‌బాబు చివరగా రాజీనామా చేయాలనే నిర్ణయానికే మొగ్గు చూపారు. అందులో భాగంగా రాత్రి 9.30 గంటల సమయంలో రాజీనామా పత్రాన్ని తన సిబ్బంది ద్వారా సీఎం క్యాంపు కార్యాలయానికి పంపారు. అనివార్య కారణాలవల్ల మంత్రి పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నానని, వెంటనే రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ రాజీనామాను ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నర్‌కు పంపే అవకాశాలు లేవని కిరణ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. శ్రీధర్‌బాబు మాత్రం రాజీనామాపై అధికారికంగా స్పందించలేదు. శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయి.