నిధులన్నీ ‘నీళ్ల’పాలు
► మంత్రి సునీత నియోజకవర్గంలో దాహం తీర్చని రూ.14.69 కోట్ల పథకం
► పదేళ్లుగా చుక్కనీరు అందలేదంటున్న గ్రామీణులు
► ఎక్కడికక్కడ పగులుతున్న పైప్‌లైన్
రామగిరి : జిల్లాలో అత్యంత వెనుకబడిన రామగిరి, కనగానపల్లి మండలాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన తాగునీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. వీటి ద్వారా ఏ ఒక్కరోజూ నీరు సక్రమంగా అందలేదంటూ గ్రామీణులు చెబుతున్నారు. మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గంలోనే ఈ దుస్థితి నెలకొనడం గమనార్హం.
ఈ రెండు మండలాల్లోని 54 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ. 14.69 కోట్లతో రామగిరి మండలం గంగంపల్లి వద్ద సత్యసాయి తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. దీన్ని 2003 మే 21న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ప్రారంభంలో కొన్ని రోజుల పాటు నీరు సక్రమంగా అందింది. తర్వాత పైప్‌లైన్లు తరచూ పగిలిపోతుండటంతో పథకం కాస్తా నీరుగారిపోయింది. ఫలితంగా రామగిరి మండలంలో 30, కనగానపల్లి మండలంలోని 24 గ్రామాలకు నీరు అందడం లేదు.
పథకం నిర్వహణలో 54 మంది కార్మికులు
ఈ పథకం కింద పీఏబీఆర్ నుంచి ఆత్మకూరు, కొండపల్లి, నర్సంపల్లి, పీఆర్ కొట్టాల మీదుగా పైప్‌లైన్ అమర్చి నీటిని సరఫరా చేసేవారు. పథకం నిర్వహణకు 54 మంది కాంట్రాక్ట్ కార్మికులను కూడా నియమించారు. కొండపల్లి నుంచి గరిమేకలపల్లి వరకు సుమారు 250 కిలోమీటర్ల పైపులైన్ ద్వారా ఆయా గ్రామాలకు తాగునీరు చేరాల్సి ఉండగా.. ఎక్కడికక్కడ పైపులు పగిలిపోతుండటంతో చుక్కనీరు అందడం లేదు. పదమూడేళ్లుగా మరమ్మతు పనులు కూడా సక్రమంగా చేపట్టడం లేదు. కాంట్రాక్టర్లు మారుతున్నారు కానీ, ఏ ఒక్క పనీ సక్రమంగా చేపట్టలేదన్న ఆరోపణలున్నాయి.
ప్రధాన పైప్‌లైన్‌లోనే లోపాలు
ప్రధాన పైప్‌లైన్ సక్రమంగా లేకపోవడంతో తరచూ లీకేజీలు ఏర్పడేవి. మరమ్మతులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఆయా కాంట్రాక్టర్ల జేబులను మాత్రమే నింపాయి. లీకేజీల నివారణకు సంబంధించి పనులు చేపట్టిన దాఖలాలు లేవు.