సాక్షి, విశాఖపట్నం: పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత సూచించారు. సిరిపురం వుడా చిల్డ్రన్ ఏరినాలో ‘వైఎస్సార్ కిశోర వికాసం ఫేజ్-3’ కార్యక్రమాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాల్యం నుంచి యవ్వన దశలో అడుగుపెట్టేటప్పుడు అనేక మార్పులు కలుగుతాయని.. ఆ దశలో తీసుకునే నిర్ణయాలే జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. సమాజంలో ఉమ్మడి కుటుంబాలు కరవయ్యాయన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చారు.
చెడుగా ప్రవర్తిస్తే ప్రతిఘటించాలి..
ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితుల ప్రవర్తనను పిల్లలు గమనించాలని.. చెడుగా ప్రవర్తిస్తే ప్రతిఘటించాలని సూచించారు. సినిమాలను చూసి అశ్లీల డ్రెస్సింగ్ చేసుకోవద్దని.. చక్కటి వస్త్రధారణతో సంస్కృతి పాటించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళల రక్షణ కోసం సైబర్ మిత్ర ప్రవేశపెట్టారని వెల్లడించారు. టీనేజీ పిల్లలకు చదువుతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్ఠికాహారం అవసరం అని తెలిపారు. ఐరన్ ఫుడ్ ద్వారా రక్తహీనత తగ్గించుకోవచ్చని సూచించారు. బాల్య వివాహాలు ఇంకా జరగడం విచారకరమని.. వాటికి అడ్డుకట్ట వేయాల్సింది తల్లిదండ్రులేనని తెలిపారు. మహిళల జీవితాల్లో సంతోషం చూడాలనే ఉద్దేశంతోనే సీఎం వైఎస్ జగన్ మద్యపాన నిషేధం చేపట్టారన్నారు.
మన వివాహ వ్యవస్థ చాలా గొప్పది: అవంతి శ్రీనివాస్
విదేశీ సంస్కృతికి అలవాటు పడి మన సంప్రదాయాన్ని విస్మరించడం తగదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మన పూర్వీకులు ఇచ్చిన వివాహ వ్యవస్థ చాలా గొప్పదని.. విలువలతో కూడిన జీవనం సాగించాలని సూచించారు. సీఎం జగన్.. మంత్రి వర్గంలో ముగ్గురు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చి మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. దేశాభివృద్ధిలో ఆడపిల్లల పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్యెల్యే తిప్పల నాగిరెడ్డి, విఎంఆర్‌డిఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ గంటా హైమవతి, జాయింట్ కలెక్టర్ సూర్యకళ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment