కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకు మంత్రులు కుట్రపన్నుతున్నాని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ఆరోపించారు. కర్నూలు పాతబస్టాండులోని గాంధీపార్కు ఎదుట జిల్లా రిటైర్డు పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.
దీక్ష శిబిరాన్ని సందర్శించి ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజలు ఉద్యమాలు నిర్వహిస్తుంటే మంత్రులు రాజీనామా చేయకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ప్రజాకాంక్షలను పక్కనబెడ్డి పదవులు పట్టుకుని వేలాడుతుండటం దౌర్భాగ్యమన్నారు. ఇంటికొకరు ఉద్యమంలో పాల్గొనాలి.. సోనియాగాంధీ మెడలు వంచి సమైక్యాంధ్ర సాధిద్దామన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రవాసులకు భవిష్యత్తు లేకుండా పోతుందన్నారు. విభజన జరిగితే కృష్ణాజలాలు అందకుండా పోతాయని, సాగు, తాగు నీటికి ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వివరించారు.
ఆ పరిస్థితి ఏర్పడకుండా కలిసికట్టుగా పోరాటం చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని ఎందుకు విభజిస్తున్నారో అర్థం కావడం లేదని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ప్రజలకు అండగా నిలవాల్సిన మంత్రులు తప్పించుకుతిరగడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో పార్టీ సిటీ కన్వీనర్ ఎ.బాలరాజు, నాయకులు డాక్టర్ గిడ్డయ్య, షరీఫ్, సలీం, హకీం తదితరులు పాల్గొన్నారు. రిటైర్డు డీఎస్పీ పాపారావు, రిటైర్డు ఎస్సై ఎన్.కరుణాకరరావు, రిటైర్డ్ ఉద్యోగులు బి.దేవన్న, వి.ప్రకాశ్‌రాజ్, వి.శేషిరెడ్డి, ఎం.ఓబయ్య, ఎన్.ఇమాన్యుయేల్, హకీం, ఎస్.ఎం.బాష దీక్షల్లో కూర్చున్నారు.
ఉద్యమాన్ని నీరుగార్చేందుకు మంత్రుల కుట్ర
Published Wed, Sep 4 2013 6:25 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
Advertisement