
భూములను పరిశీలించిన మంత్రులు
తాడేపల్లిగూడెం : పట్టణంలో విమానాశ్రయ భూములను రాష్ట్ర మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, పి.నారాయణ, పీతల సుజాత మంగళవారం రాత్రి పరిశీలించారు. ఈ భూములలో వ్యవసాయ యూనివర్సిటీ నిర్మించాలనే ప్రతిపాదనలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో పరిశీలనకు ప్రాధాన్యత వచ్చింది. తర్వాత వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీని మంత్రుల బృందం సందర్శించింది. వర్సిటీ ప్రాంగణంలో పరిశోధన, విస్తరణలపై తీసుకునే చర్యలను వర్సిటీ రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు, ఎస్టేట్ ఆఫీసర్ పీఆర్‌పీ రాజు మంత్రులకు వివరించారు.
ఈ మేరకు రూపొందించిన మ్యాప్‌లను చూపించారు. మూడు నియోజకవర్గాల పరిధిలో వర్సిటీ ఉందని, ఇక్కడ అదనంగా వర్సిటీ వస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు మంత్రులకు తెలిపారు. వైఎస్సార్ వర్సిటీ పరిశోధన, విస్తరణ కోసం 800 ఎకరాలు పోను, సుమారు 2,200 ఎకరాల పైచిలుకు భూమి అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు. ఉద్యోగుల, పరిశోధనాశాలలు, తదితర వివరాలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. బత్తాయి, కొబ్బరి పరిశోధన శాలలు, కొవ్వూరు అరటి పరిశోధనా శాల, డెరైక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చర్, వర్సిటీకి అదనంగా భూమిని దఖలు పరిస్తే ఏం చేస్తారనే మంత్రుల ప్రశ్నలకు అధికారులు బదులిచ్చారు.
పురపాలక శాఖా మంత్రి నారాయణ ఆలస్యంగా రావడంతో చీకటిలోనే విమానాశ్రయ భూముల మ్యాప్‌లను పరిశీలించారు. అనంతరం వర్సిటీలో మ్యాప్‌లను చూశారు. మంత్రి మాణిక్యాలరావు ఇంటికి వెళ్లిన మంత్రి ఘంటా శ్రీనివాస్ యూనివర్సిటీ ఏర్పాట్లపై చర్చించి తిరిగివెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, కలెక్టర్ కె.భాస్కర్, ఏలూరు ఆరీవో బి.శ్రీనివాసు తదితరులు ఉన్నారు.