
టీడీపీ కాచుకుని ఉంది.. తస్మాత్ జాగ్రత్త!
మంత్రులు, అధికారులు జాగ్రత్తగా ఉండాలని సీఎం హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసు పరిణామాలతో రాష్ర్ట ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ సీఎం చంద్రబాబు ఈ కేసులో ఇరుక్కోవడంతో టీడీపీ నేతలు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అందుకే అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులను హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థులకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా మెదలాలని సూచించారు.
లంచాలు, ప్రలోభాలకు లొంగిపోతే, అవినీతి, అక్రమాలకు పాల్పడితే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదముందని బుధవారం నాటి కేబినెట్ సమావేశంలోనే మంత్రులను సీఎం సుతిమెత్తగా హెచ్చరించారు. టీడీపీ కాచుకుని ఉన్నందున స్టింగ్ ఆపరేషన్లు, ఫోన్ రికార్డింగ్‌లు చేసే ప్రమాదముందని నొక్కి చెప్పారు. కొత్త వ్యక్తుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, పరిచయస్తులను కూడా నమ్మకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు.
ట్యాపింగ్ చేస్తున్నారంటూ గోల చేస్తున్న టీడీపీ.. అవకాశం దొరికితే తెలంగాణ అధికారులపై కూడా బురద జల్లేందుకు వెనుకాడకపోవచ్చని నిఘా వర్గాలను కేసీఆర్ అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరికీ ఈ సమాచారం చేరవేశారు.