మంత్రుల్లో సమన్వయ లోపం
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రుల మధ్య సమన్వయం లోపించిందని మాజీమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నెలలు, చంద్రబాబు సీఎం అయ్యి రెండు నెలలైనప్పటికీ ప్రభుత్వ పాలనా విధానాలు ఘోరంగా ఉన్నాయన్నారు. మంత్రుల్లో సమన్వయం లేదని, ఎమ్మెల్యేలకు వారి విధివిధానాలు తెలియడం లేదన్నారు. ఉద్యోగుల బదిలీలు, అంగన్‌వాడీ టీచర్లకు వేధింపులు, ఎన్‌ఆర్‌ఈజీసీ ఉద్యోగుల తొలగింపు, కక్షసాధింపు చర్యలు చేపట్టడం వంటి కార్యక్రమాలే ఎమ్మెల్యేల విధి విధానాలుగా క నబడుతున్నాయన్నారు. మంత్రులకు, అధికారులకు మధ్య పాలనా పరంగా పొంతనలేదన్నారు.
బాబుకు ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ల అనుభవం ఉన్నప్పటికీ పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారని దుయ్యబట్టారు. విశాఖను రాజధానిగా చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన కలెక్టర్‌లు, ఎస్పీల సమావేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యకర్తల సమావేశంగా మార్చేశారని విమర్శించారు. అన్ని పనులపై కమిటీలను వేసి సీఎం కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.‘సాక్షి’పై అనుచిత వ్యాఖ్యలు తగవునీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమ తన బాధ్యతలను మరచి ‘సాక్షి’ దినపత్రికపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపుతూ ప్రజల సమస్యల కోసం పరితపిస్తున్న పత్రిక ‘సాక్షి’ అన్నారు.