హోంశాఖ.. ముళ్ల కిరీటం
పెద్దాపురం: హోం మంత్రి పదవి అంటే నెత్తిపై ముళ్ల కిరీటం పెట్టుకోవడంలాంటిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత సోమవారం తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన తన నియోజకవర్గం పెద్దాపురంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నానాటికీ మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, స్మగ్లింగ్, గుండాయిజాలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు చర్యలు తీసుకుంటానన్నారు.
కీలకమైన హోం శాఖను అప్పగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనన్నారు. ఈ నెల 22న మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తానని తెలిపారు. ముప్పయ్యేళ్లుగా మంత్రి పదవి లేనందువల్లనే పెద్దాపురం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. నియోజకవర్గాన్ని, జిల్లాను అభివృద్ధి చేస్తానని చెప్పారు. లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి మరణానంతరం జిల్లాకు సంబంధించిన చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటన్నింటినీ సాధిస్తానని పేర్కొన్నారు.