ధర్మవరం అర్బన్: అభం.. శుభం కూడా తెలియని ఓ మైనర్ బాలిక ప్రేమ వేధింపులు తాళలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. నిండా 14 సంవత్సరాలు కూడా నిండని ఆ బాలికను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయడంతో పాటు, చంపుతామని కూడా బెదిరించడంతో కన్నవారికి చెప్పుకోలేకా... తానే ఈ లోకం నుండి వెళ్ళిపోవాలని ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు... ధర్మవరం పట్టణం లక్ష్మినగర్‌కు చెందిన మైనర్ బాలిక జోత్స్న (14) కొత్తపేట ప్రాంతంలోని మసీదు వద్ద ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. సంవత్సరకాలం నుంచి ఇదే కాలనీలో కూలిమగ్గం నేసుకునే హరి అనే యువకుడు ప్రేమ పేరుతో ఆ బాలికను వేదింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో నెలరోజుల నుంచి ఈ వేధింపులు మరింత ఎక్కువగా కావడంతో విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్ళింది. దీంతో తల్లిదండ్రులు విషయాన్ని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా... పదిరోజుల క్రితం స్టేషన్‌కు తీసుకువచ్చి యువకుడికి కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు.
పెద్ద మనుషుల జోక్యం తర్వాత హరి వేధింపులు మరింత పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కత్తి తీసుకుని వచ్చి ప్రేమించకపోతే చంపుతానని తీవ్రస్థాయిలోనే బెదిరించాడు. విషయాన్ని బయటకు చెప్పినా ఇదే గతి పడుతుందని బెదిరించడంతో బాలిక బయపడిపోయి విషయాన్ని కూడా బయటకు చెప్పలేదు. అయితే రెండు రోజుల క్రితం హరి అతని స్నేహితులు ముసుగులు ధరించి బాలికను కిడ్నాప్ చేసి ఎత్తుకుని పోతామని, ఎంతకైనా తెగిస్తామని చెప్పడంతో... భయపడిన బాలిక గురువారం రాత్రి 9.30గంటల సమయంలో ఇంట్లోని గదిలోకి వెళ్ళి ఒంటిమీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయాన్ని గమనించిన స్థానికులు బాలికను హుటాహుటిన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... 80శాతం కాలిన గాయాలు ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణ సీఐ భాస్కర్‌గౌడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ప్రేమ వేధింపులతో.. బాలిక ఆత్మహత్యాయత్నం
Published Thu, Jan 29 2015 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM
Advertisement
Advertisement