► వంచించిన వ్యాపారులు
► పట్టించుకోని ప్రభుత్వం
► పడిపోయిన మిర్చి ధర
► జిల్లా కోల్డ్ స్టోరేజీలు గుంటూరు వ్యాపారులపరం
► పంట దాచుకునే అవకాశం లేక జిల్లా రైతు విలవిల
► తక్కువ ధరకే మిర్చి అమ్ముకోవాల్సిన పరిస్థితి
► జిల్లావ్యాప్తంగా ఇప్పటికే ముగ్గురు మిర్చి రైతుల ఆత్మహత్య
► మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలుకు డిమాండ్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అటు ప్రభుత్వం, ఇటు వ్యాపారులు కలిసి మిరప రైతులను కష్టాల ఊబిలోకి నెట్టారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వక ప్రభుత్వం రైతులను నడిరోడ్డుపైకి నెట్టింది. ప్రస్తుత ధరలతో పెట్టుబడుల్లో సగం కూడా వచ్చే పరిస్థితి లేక రైతులు విలవిల్లాడుతున్నారు. అప్పుల ఊబిల్లో కూరుకుపోయి ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన చెందుతున్నారు. పోనీ గిట్టుబాటు ధర వచ్చే వరకు పంట దాచుకుందామనుకుంటే ఉన్న కోల్డ్ స్టోరేజీలను సైతం గుంటూరు జిల్లా వ్యాపారులు వశం చేసుకున్నారు.
దీంతో ఏ దారీ లేక రైతులు మిరప పంటను తెగనమ్ముకోవాల్సి వస్తోంది.జిల్లా వ్యాప్తంగా 52 కోల్డ్ స్టోరేజీలున్నాయి. అయితే గుంటూరు ప్రాంతానికి చెందిన మిర్చి వ్యాపారులు కోల్డ్ స్టోరేజీలను గుత్తమొత్తంగా తీసేసుకున్నారు. తక్కువ ధరకు రైతుల వద్ద మిర్చిని కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో స్టాకు పెట్టేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గిట్టుబాటు ధర వచ్చే వరకు మిర్చిని దాచుకోవాలనుకున్న జిల్లా రైతులకు ఇది అడ్డంకిగా మారింది. కోల్డ్ స్టోరేజీల్లో ఏ మాత్రం అవకాశం లేకపోవడంతో వారు తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది.
జిల్లావ్యాప్తంగా లక్షా 50వేల ఎకరాల్లో రైతులు మిరప సాగు చేశారు. పంట దిగుబడి తగ్గిన నేపథ్యంలో సగటున 7 నుంచి 8 క్వింటాళ్ల వరకు మిర్చి దిగుబడి వచ్చింది. గతేడాది బేడిగ రకం మిర్చి క్వింటా రూ.18 వేలు ఉండగా, తేజా రకం మిర్చి రూ.13 వేల వరకు ఉంది. ప్రస్తుతం బేడిగ రకం రూ.7 వేల లోపు ఉండగా తేజా రకం రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో మిర్చి అమ్మకానికి పెడితే రైతులకు పంట కోత కూలీలు కూడా వచ్చే పరిస్థితుల్లేవు.
కౌలుతో కలుపుకొని ఎకరానికి లక్షా 20 వేల నుంచి లక్షా 50 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుత దిగుబడి, ధరను పోల్చి చూస్తే ఎకరానికి రూ.80 వేలకు తగ్గకుండా రైతుకు నష్టం వస్తోంది. ఒక వేళ ధర వచ్చే వరకు పంటను కోల్డ్ స్టోరేజీల్లో దాచుకుందామన్నా..గుంటూరు ప్రాంత వ్యాపారులు ఆ అవకాశం కూడా లేకుండా చేశారు. దీంతో ఇక్కడి రైతాంగం లబోదిబోమంటోంది. కోల్డ్ స్టోరేజీల్లో వ్యాపారులకు కాకుండా రైతులకు అవకాశమివ్వాలంటూ రైతులతో పాటు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
ఆత్మహత్యల దిశగా రైతులు:
మిర్చి ధరలు పతనావస్థకు చేరడంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఆదిలో నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులకు ఆ తర్వాత పంట దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇదే సమయంలో ధరలు పడిపోవడంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. మరోవైపు బ్యాంకులు సైతం రుణాలు కట్టాలంటూ రైతులపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఇప్పటికే యర్రగొండపాలెం, దర్శి తదితర ప్రాంతాల పరిధిలో ముగ్గురు మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
పరిస్థితి ఇలాగే ఉంటే ఈ ఆత్మహత్యలు మరింతగా పెరిగే అవకాశం ఉందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మిరప రైతులను ఆదుకునే ప్రయత్నం చేయకుండా సమస్యను కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న మిర్చిని మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర ఇచ్చి మిర్చి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
వెంటనే ఫసల్ బీమా యోజన ఇవ్వాలి:
మిరప రైతుల నుంచి 10 శాతం చొప్పున రూ.6 వేలు ఫసల్ బీమా యోజన కింద కట్టించుకున్నారు. దీనికి సంబంధించిన పరిహారాన్ని తక్షణం మిరప రైతులకు చెల్లించాలి. జిల్లాలోని అన్ని మండలాల ను కరువు మండలాలుగా ప్రకటించినందున వడ్డీ లేకుండా రీ–షెడ్యూలు రుణాలను రైతులకు ఇవ్వాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం తక్షణం స్పందించి మిరప రైతుల సమస్యను కేంద్రంపైకి నెట్టక మార్క్‌ఫెడ్ ద్వారా గిట్టుబాటు ధర ఇచ్చి మిర్చి కొనుగోలు చేయాలని రైతు సంఘం నేత గోపినాథ్ డిమాండ్ చేశారు.