కుంచనపల్లి (తాడేపల్లి రూరల్): తాడేపల్లి మండల పరిధిలోని కుంచనపల్లి జాతీయ రహదారిలో బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జిపై గురువారం అర్థరాత్రి జరిగిన పెను ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో తాడేపల్లి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంకు సంబంధించి బస్సు డ్రైవర్‌పై ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి ఎస్‌ఐ ప్రతాప్‌కుమార్ కేసు నమోదు చేశారు.
తెనాలి నుంచి వయా గుంటూరు మీదుగా విజయవాడ చేరుకుని అక్కడనుంచి హైదరాబాద్ వెళ్లే శ్రీ సాయికృష్ణ ట్రావెల్స్ బస్సులో తెనాలి, గుంటూరులో 35 మంది ప్రయాణికులను ఎక్కించుకుని జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా కుంచనపల్లి బ్రిడ్జి వద్దకు రాగానే ఎదురుగా ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి కుడివైపునకు వెళ్లి అటు ప్రయాణిస్తున్న మరో లారీని తప్పించబోయి బకింగ్‌హామ్ కెనాల్ బ్రిడ్జి రైలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు చక్రం ఒకటి బ్రిడ్జి అంచు భాగంలో వేలాడుతుండగా, మరో చక్రం డివైడర్‌ను ఆనుకుని బస్సు నిలిచిపోయింది.
ఆ సమయంలో వెనుకనుంచి ఎటువంటి వాహనాలు రాకపోవడం వల్ల బస్సు అక్కడితో ఆగిపోయింది. హైవే మీద 60 నుంచి 100 కిలోమీటర్ల స్పీడుతో ప్రయాణిస్తూ వెళ్తున్న బస్సు ఎదురుగా ఉన్న ట్రాక్టర్‌ను గమనించక పోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏదేమైనా ప్రమాదం పెద్దదైనప్పటికీ ప్రాణనష్టం లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సంఘటనపై బస్సులో ప్రయాణిస్తున్న ప్రకాశం జిల్లా బిళ్ళకుదురు మండలానికి చెందిన ఎ.కిషోర్ ఫిర్యాదు చేయడంతో డ్రైవర్ చక్రపాణి, ట్రావెల్ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సులో డ్రైవర్‌తో పాటు సహాయకుడు కూడా లేడని, కనీసం ప్రమాదం జరిగినప్పుడు అద్దాలు పగులగొట్టడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదని ప్రయాణికులు వాపోయారు. బస్సులో ఉన్న యువకులే అద్దాలు పగలగొట్టి బయటకు రావాల్సివచ్చిందని, ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ప్రయాణికుల క్షేమం గురించి ఆలోచించకుండా పరారైనట్టు కిషోర్ తెలియచేశారు.
Comments
Please login to add a commentAdd a comment