స్కూలు బస్సుకు తప్పిన పెను ప్రమాదం | Missed a major school bus accident | Sakshi
Sakshi News home page

స్కూలు బస్సుకు తప్పిన పెను ప్రమాదం

Published Tue, Jan 29 2019 3:49 AM | Last Updated on Tue, Jan 29 2019 3:49 AM

Missed a major school bus accident - Sakshi

ఘటనా స్థలంలో సహాయక చర్యలు

వెల్దుర్తి (మాచర్ల):  గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వస్తూ మాచర్ల మండలం మండాది వద్ద సోమవారం ఉదయం 8 గంటలకు కానవాగులో బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయురాలితో పాటు ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలవ్వగా, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 26 మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. మండలంలోని ఉప్పలపాడు, మండాది గ్రామాల నుంచి ప్రతిరోజూ విద్యార్థులను స్కూల్‌ బస్సులో తీసుకొచ్చి తిరిగి సాయంత్రం వదిలి వస్తుంటారు. సోమవారం యధావిధిగా విద్యార్థుల్ని ఎక్కించుకుని వస్తుండగా, కానవాగు వద్ద బస్సు స్టీరింగ్‌ రాడ్‌ ఊడిపోవడంతో అదుపు తప్పి వాగులోకి బోల్తా పడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న బోర్‌వెల్‌ వాహనం వారు వాగులోకి వెళ్లి బస్సు అద్దాలు పగులగొట్టి విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేశారు. వీరు వెంటనే స్పందించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఈలోపు మండాది గ్రామస్తులు సైతం అక్కడకు చేరుకుని బస్సులో ఇరుక్కున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తెచ్చారు.
ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను హుటాహుటిన మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉప్పలపాడు గ్రామానికి చెందిన విద్యార్థులు దాసి రాజు, బలిగొడుగుల అజయ్, మారెబోయిన నవీన్, ఒంటేరు వాసు, తన్విజ్‌ రెడ్డి, భార్గవి, ఉపాధ్యాయురాలు కామిరెడ్డి మల్లీశ్వరిలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గుంటూరు, నరసరావుపేట వైద్యశాలలకు తరలించారు. స్వల్పంగా గాయపడిన 26 మంది విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. సంఘటనా స్థలానికి గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు, మాచర్ల ఎంవీఐ ఎ.మాధవరావు, ఇన్‌చార్జి తహసీల్దారు బుడేసాహెబ్, మాచర్ల రూరల్‌ సీఐ ఎ.వెంకటేశ్వర్లు, తదితరులు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాగులో నీరు లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పిందని, లేకపోతే తమ పిల్లల పరిస్థితి ఏమిటంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్‌ బస్సు రాడ్‌ ఊడిపోయే పరిస్థితి వచ్చే వరకు చూసుకోకుండా పాఠశాల యాజమాన్యం, బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వహించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైద్యుల నిర్లక్ష్యంపై ఆందోళన 
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, గ్రామస్తులు గాయపడిన విద్యార్థులను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యులు ఎవరూ లేకపోవడం, సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు అక్కడే ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. వైద్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని హెచ్చరించారు. 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్‌ కూడా లేకపోవడంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థులను తన సొంత వాహనంలో మాచర్లలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. పిల్లలకు ఏదైనా జరిగితే అందుకు ప్రభుత్వం, వైద్య అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే హెచ్చరించారు.  

బస్సులో పరిమితికి మించి విద్యార్థులు 
పరిమితికి మించి విద్యార్థులను తరలించడం వల్లే ఎక్కువ మంది విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది. ఉప్పలపాడు, మండాది గ్రామాల్లో కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌కు వచ్చే విద్యార్థులు 90 మంది ఉండగా, ఒకే ట్రిప్పులో వీరిని చేరవేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 57 మంది పట్టే బస్సులో 70 నుంచి 90 మందిని తిప్పుతున్నా రవాణా శాఖ, పోలీసు, విద్యా శాఖ అధికారులు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. సోమవారం వర్షం కారణంగా 20 మంది వరకు విద్యార్థులు పాఠశాలకు రాకపోవడంతో ప్రమాద సమయంలో బస్సులో 70 మంది విద్యార్థులే ఉన్నారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement