
తప్పిన పెను ముప్పు నిండు నిర్లక్ష్యం
=ఏసీ బోగీలో నిబంధనలకు విరుద్ధంగా వైరింగ్
=ఎల్‌సీడీతో పాటు అన్ని సౌకర్యాలు
=ఐఆర్‌టీసీ రైలులో భద్రతా లోపాలు
=దక్షిణమధ్య రైల్వే జీఎం సమీక్ష
సాక్షి, విజయవాడ : మరో పెను ముప్పు తప్పింది. రైల్వే అధికారులు, సిబ్బంది నిండు నిర్లక్ష్యంతో మరో నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఘటన పునరావృతమయ్యే ప్రమాదం.. విజయవాడలో ముందే బయటపడింది. దీంతో పెద్ద ఉపద్రవం నుంచి ప్రయాణికులు బయటపడ్డారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తున్నా అధికారులు గుణపాఠం నేర్చుకున్న దాఖలాలు కనపడటం లేదని ఈ ఘటనతో తేటతెల్లమైంది.
నిబంధనలకు విరుద్ధంగా కొత్తచెరువు వద్ద శనివారం తెల్లవారుజామున బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో అగ్నిప్రమాదం సంభవించి 26 మంది సజీవదహనమైన ఘటన కళ్లల్లో మెదులుతుండగానే విజయవాడ రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న రైలులోని ఏసీ కోచ్‌ల నుంచి పొగలు రావడం కలకలం సృష్టించింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులు అదనంగా వైరింగ్ లాగి ఎల్‌సీడీ టీవీ నుంచి ల్యాప్‌ట్యాప్‌ల వరకు చార్జింగ్ పెట్టుకునే ఏర్పాట్లు చేసుకున్నారు.
ఆదాయంపై దృష్టి పెట్టిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా లోడ్ కన్నా అధికంగా విద్యుత్ ఏర్పాట్లుచేసినా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదం విజయవాడ స్టేషన్‌లో మెయింటెనెన్స్ కోసం ఆగిన సమయంలో జరగడంతో పెను ప్రమాదం తప్పింది. అదే రాత్రి సమయంలో జరిగి ఉంటే మరో నాందేడ్ ఘటన పునరావృతం అయ్యేదన్న భావన అధికారులలో వ్యక్తం అవుతోంది.
రంగంలోకి దక్షిణమధ్య రైల్వే జీఎం...
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ కూడా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. ఇండియన్ రైల్వే టూరిజం అండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాగృతి సంస్థ వారు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు విద్యార్థులతో ప్రసిద్ధి చెందిన ప్రదేశాలను వీక్షిస్తున్నారు. దానిలో భాగంగా ఈ నెల 24న ముంబయిలో బయలుదేరి బెంగళూరు, మధురై, చెన్నైల మీదుగా విశాఖపట్నానికి వెళ్తున్నారు. విజయవాడలో మెయింటెనెన్స్నిమిత్తం రైలును నిలిపివేశారు.
విద్యార్థులందరూ దిగి నగరంలోకి వెళ్లిన తర్వాత ఆ రైలులోని ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా పొగ, నిప్పురవ్వలు వచ్చాయి. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను అదుపుచేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బోగీల లోపల నిబంధనలకు వ్యతిరేకంగా వైరింగ్ చేసినా పట్టించుకోని సిబ్బందిపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.