విపక్ష నేతలపై ఎమ్మెల్యే బండారు దుర్భాషలు
ఆరోపణలపై వివరణ ఇవ్వకుండా జగన్, విజయసాయిరెడ్డిలపై దూషణలు
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, మహిళల ముందే తిట్ల దండకం
పెందుర్తి: పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తాను ఓ ప్రజాప్రతినిధినన్న విషయం కూడా మరచిపోయి సంస్కారం లేకుండా విపక్ష నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రభుత్వ పాఠశాలలో బండారు తిట్ల పురాణం చూసి అక్కడున్న విద్యార్థులు, మహిళలు, ఉపాధ్యాయులతోపాటు సొంత పార్టీ కార్యకర్తలే నివ్వెరపోయారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలను లక్ష్యంగా చేసుకుని బండారు నోరుపారేసుకున్నారు. వేపగుంటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో నిస్సిగ్గుగా రాయడానికి వీలులేని విధంగా ఆయన మాట్లాడారు. తనపై, తన కుమారుడిపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇవ్వకుండా ప్రతిపక్ష నేతలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. రెండుసార్లు ఎంపీపీగా చేశా.. నాలుగు సార్లు ఎమ్మెల్యేని.. ఓ సారి మంత్రిని అని అంటూనే దుర్భాషలకు దిగారు. ‘నా కొడకా.. వెధవ.. స్కౌండ్రల్..(పత్రికలో రాయలేని మాటలు) లాంటి పదాలతో సంభోదిస్తూ తిట్ల దండకం చదివారు.
దిగజారి మాట్లాడటం బండారుకు అలవాటే
బండారు దిగజారి మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. నాలుగేళ్ల క్రితం ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో పెందుర్తిలో తన పార్టీకే చెందిన పీలా శ్రీనివాసరావు వర్గీయులపై దాడులకు దిగారు. నడిరోడ్డుపై దూషణలకు దిగారు. ఏడాది క్రితం పెందుర్తి పోలీస్‌స్టేషన్ వద్ద ఆసుపత్రికి స్థల పరిశీలన సందర్భంగా ఓ ట్రాఫిక్ సీఐపై అందరి ముందే చిందులు తొక్కారు. అదే రోజు ఓ రెవెన్యూ అధికారి సైతం బండారు నోటి దురుసుకు బలయ్యారు.