తుని: యనమల సోదరులు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి కోట్లు సంపాదించారని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. ప్రజల సోమ్మును అడ్డదారిలో దోచుకుని, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను కబ్జా చేశారని ఆరోపించారు. తుని పట్టణం రెండో వార్డులో శనివారం ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ యనమల సోదరులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిజాయితీకి నిలువు టద్దమని యనమల రామకృష్ణుడు చెప్పుకుంటున్నారని, వందల కోట్లు ఆస్తులను ఎలా కూడబెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పట్టణ నడిబొడ్డులో ఉన్న బాతుల కోనేరు స్థలాన్ని దొడ్డుదారిలో బినామీలతో ఆక్రమించారని, ప్రస్తుతం ఆ స్థలాన్ని గజానికి రూ.లక్షకు బేరం పెట్టారన్నారు. రైల్వే ట్రాక్ ఆవతల ఉన్న పది వార్డులకు చెందిన నీరు పోవడానికి ఏర్పాటు చేసిన కాలువను కలిపేసుకున్నారని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతి పనికి ముడుపులు తీసుకుని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకున్నారన్నారు. పేదలకు ఉచితంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అవినీతికి కేరాఫ్ అడ్రాస్‌గా మార్చారన్నారు.
పురుడు పోసుకోవడానికి పేదలు వెళితే రూ. 6 వేలు వసూలు చేస్తున్నారని, ఇందుకు తమకు అనుకూలమైన ఏజెంట్లను పెట్టుకున్నారన్నారు. మున్సిపల్ కార్యాలయాన్ని టీడీపీ కార్యాలయంగా మార్చారని, వైఎస్సార్ సీపీకి మద్దతు ఇచ్చే వారిని పిలిపించి బెదరింపులకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను సొమ్ములకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు ఏ విధంగా మేలు చేశారో జననేత జగన్‌మోహన్‌రెడ్డి అదే రీతిలో పాలన చేస్తారన్నారు.
సువర్ణ పాలన కోసం వైఎస్సార్ సీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు పెదపాటి అమ్మాజీ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వేంకటేష్, సీనియర్ నాయకుడు అనిశెట్టి నాగిరెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు రేలంగి రమణాగౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment