mla dadisetti raja
-
యనమల సోదరులది రాజకీయ వ్యాపారం
తుని: యనమల సోదరులు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి కోట్లు సంపాదించారని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. ప్రజల సోమ్మును అడ్డదారిలో దోచుకుని, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను కబ్జా చేశారని ఆరోపించారు. తుని పట్టణం రెండో వార్డులో శనివారం ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ యనమల సోదరులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిజాయితీకి నిలువు టద్దమని యనమల రామకృష్ణుడు చెప్పుకుంటున్నారని, వందల కోట్లు ఆస్తులను ఎలా కూడబెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణ నడిబొడ్డులో ఉన్న బాతుల కోనేరు స్థలాన్ని దొడ్డుదారిలో బినామీలతో ఆక్రమించారని, ప్రస్తుతం ఆ స్థలాన్ని గజానికి రూ.లక్షకు బేరం పెట్టారన్నారు. రైల్వే ట్రాక్ ఆవతల ఉన్న పది వార్డులకు చెందిన నీరు పోవడానికి ఏర్పాటు చేసిన కాలువను కలిపేసుకున్నారని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతి పనికి ముడుపులు తీసుకుని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకున్నారన్నారు. పేదలకు ఉచితంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అవినీతికి కేరాఫ్ అడ్రాస్గా మార్చారన్నారు. పురుడు పోసుకోవడానికి పేదలు వెళితే రూ. 6 వేలు వసూలు చేస్తున్నారని, ఇందుకు తమకు అనుకూలమైన ఏజెంట్లను పెట్టుకున్నారన్నారు. మున్సిపల్ కార్యాలయాన్ని టీడీపీ కార్యాలయంగా మార్చారని, వైఎస్సార్ సీపీకి మద్దతు ఇచ్చే వారిని పిలిపించి బెదరింపులకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను సొమ్ములకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు ఏ విధంగా మేలు చేశారో జననేత జగన్మోహన్రెడ్డి అదే రీతిలో పాలన చేస్తారన్నారు. సువర్ణ పాలన కోసం వైఎస్సార్ సీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు పెదపాటి అమ్మాజీ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వేంకటేష్, సీనియర్ నాయకుడు అనిశెట్టి నాగిరెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు రేలంగి రమణాగౌడ్ పాల్గొన్నారు. -
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
-
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
సీపీఎం బహిరంగ సభను అడ్డుకునేందుకు ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ముందస్తు చర్యలో భాగంగా సభకు మద్దతు తెలిపారన్న కారణాలతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పలువురు సీపీఎం నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. దివీస్ భూసేకరణను వ్యతిరేకిస్తూ సీపీఎం పార్టీ బహిరంగసభ నిర్వహించనుంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ బహిరంగసభకు వైఎస్ఆర్ సీపీ, సీపీఐ, కొన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. బహిరంగసభను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం పంపాదిపేట, తాటాకుపాలెం, కొత్తపాకుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. రైతులు తమ భూములను ఇచ్చేందుకు అంగీకరించారని సర్కారు చెబుతున్నా.. అందులో వాస్తవం లేదని, రైతులు ఈ భూసేకరణపై అయిష్టత చూపుతున్నారని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. -
తుని ఎమ్మెల్యేపై దాడి అమానుషం
దాడిశెట్టి రాజాకు వైఎస్సార్సీపీ నేతల పరామర్శ పాయకరావుపేట: తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై ఇసుక మాఫియా, టీడీపీ నాయకులు దాడి చేయడం అమానుషమని జెడ్పీ ఫ్లోర్ లీడర్ చిక్కాల రామారావు, ఎంపీపీ అల్లాడ శివకుమార్, వైఎస్సార్సీపీ మండల ఆధ్యక్షులు ధనిశెట్టి బాబురావు, మండల యూత్ అధ్యక్షులు నీలాపు చిరంజీవిరెడ్డి పేర్కొన్నారు. తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీకి చెందిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను సోమవారం వారు పరామర్శించారు. అనంతరం వారు పాయకరావుపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల భూముల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని అడ్డుకున్నందుకు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై దాడికి పాల్పడ్డారన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై అట్రాసిటీ కేసు,తహశీల్దార్ వనజాక్షిపై దాడి అన్యాయమన్నారు. టీడీపీ నాయకులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ శ్రేణులను టార్గెట్గా చేసుకుని దాడులకు పాల్పడి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు,అధికారులకు రక్షణ లేనప్పుడు ప్రజలకు ఏం రక్షణ ఉంటుందని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజాను పరామర్శించిన వారిలో పార్టీ నాయకులు దేవవరపు వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ తోట సత్యకిరణ్, గంగిరెడ్డి వెంకటరమణ, నీలాపు బాలకృష్ణారెడ్డి, బి.వి.రమణ,పందిరి ధర్మాజి తదితరులు ఉన్నారు. రాష్ర్టంలో అరాచక పాలన: వీసం నక్కపల్లి: ఇసుక మాఫియా దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీకి చెందిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను ఆ పార్టీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ సోమవారం పరామర్శించారు. తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కలిసి ఆరోగ్యపరిస్థితి, దాడి జరిగిన తీరును తెలుసుకున్నారు. అనంతరం నక్కపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందన్నారు. అధికార మదంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారన్నారు.జిల్లాలో తాండవ, వరాహానదులను ఇద్దరు మంత్రులు పంచుకుని ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక అక్రమ తరలింపులో మంత్రులకు ముడుపులు అందడంవల్లే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. తుని ఎమ్మెల్యే రాజాకు అండగా నిలుస్తామన్నారు. తక్షణమే రాజాపై దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
అధైర్యపడకండి..
తొండంగి :సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సోమవారం పరామర్శించారు. తీరంలోని ఎల్లయ్యపేట, హకుంపేట తదితర గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి పర్యటించారు. ఎల్లయ్యపేటలో చొక్కా రాజు, కోడా సత్యనారాయణ, మడదా మహేశ్వరరావు, చింతకాయల కాశీరావు, సిరిపిన గోవిందు, దైలపల్లి రాజు తదితరుల కుటుంబాలను.. హుకుంపేటలో బోటు యజమానులు పెరుమాళ్ల పెదకోదండం, సూరాడ మసేనులతోపాటు 23 మత్స్యకార కుటుంబాలను ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాల మహిళలు మాట్లాడుతూ, గల్లంతైన తమవారికి సంబంధించి ఏ ఒక్క అధికారీ సమాచారం ఇవ్వడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తమకు ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వాలని కోరారు. వారం రోజులుగా తమవారి కోసం నిద్రాహారాలు మాని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ, గల్లంతైనవారి ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా ఇప్పటికే కలెక్టర్కు విజ్ఞప్తి చేశామని వివరించారు. కొందరి బోట్లు దగ్గరలో ఉన్నట్టు సమాచారం అందిందన్నారు. అధైర్య పడవద్దని బాధితులను ఓదార్చారు. అనంతరం ఆయా కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు కోడా వెంకట రమణ, తొండంగి సొసైటీ డెరైక్టర్ అంబుజాలపు పెదసత్యనారాయణ తదితరులున్నారు.