
తుని ఎమ్మెల్యేపై దాడి అమానుషం
దాడిశెట్టి రాజాకు వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
పాయకరావుపేట: తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై ఇసుక మాఫియా, టీడీపీ నాయకులు దాడి చేయడం అమానుషమని జెడ్పీ ఫ్లోర్ లీడర్ చిక్కాల రామారావు, ఎంపీపీ అల్లాడ శివకుమార్, వైఎస్సార్‌సీపీ మండల ఆధ్యక్షులు ధనిశెట్టి బాబురావు, మండల యూత్ అధ్యక్షులు నీలాపు చిరంజీవిరెడ్డి పేర్కొన్నారు. తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీకి చెందిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను సోమవారం వారు పరామర్శించారు. అనంతరం వారు పాయకరావుపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రైతుల భూముల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని అడ్డుకున్నందుకు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై దాడికి పాల్పడ్డారన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై అట్రాసిటీ కేసు,తహశీల్దార్ వనజాక్షిపై దాడి అన్యాయమన్నారు. టీడీపీ నాయకులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ శ్రేణులను టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎమ్మెల్యేలు,అధికారులకు రక్షణ లేనప్పుడు ప్రజలకు ఏం రక్షణ ఉంటుందని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజాను పరామర్శించిన వారిలో పార్టీ నాయకులు దేవవరపు వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ తోట సత్యకిరణ్, గంగిరెడ్డి వెంకటరమణ, నీలాపు బాలకృష్ణారెడ్డి, బి.వి.రమణ,పందిరి ధర్మాజి తదితరులు ఉన్నారు.
రాష్ర్టంలో అరాచక పాలన: వీసం
నక్కపల్లి: ఇసుక మాఫియా దాడిలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీకి చెందిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను ఆ పార్టీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ సోమవారం పరామర్శించారు. తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కలిసి ఆరోగ్యపరిస్థితి, దాడి జరిగిన తీరును తెలుసుకున్నారు. అనంతరం నక్కపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందన్నారు. అధికార మదంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారన్నారు.జిల్లాలో తాండవ, వరాహానదులను ఇద్దరు మంత్రులు పంచుకుని ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక అక్రమ తరలింపులో మంత్రులకు ముడుపులు అందడంవల్లే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. తుని ఎమ్మెల్యే రాజాకు అండగా నిలుస్తామన్నారు. తక్షణమే రాజాపై దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.