తొండంగి :సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సోమవారం పరామర్శించారు. తీరంలోని ఎల్లయ్యపేట, హకుంపేట తదితర గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి పర్యటించారు. ఎల్లయ్యపేటలో చొక్కా రాజు, కోడా సత్యనారాయణ, మడదా మహేశ్వరరావు, చింతకాయల కాశీరావు, సిరిపిన గోవిందు, దైలపల్లి రాజు తదితరుల కుటుంబాలను.. హుకుంపేటలో బోటు యజమానులు పెరుమాళ్ల పెదకోదండం, సూరాడ మసేనులతోపాటు 23 మత్స్యకార కుటుంబాలను ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాల మహిళలు మాట్లాడుతూ, గల్లంతైన తమవారికి సంబంధించి ఏ ఒక్క అధికారీ సమాచారం ఇవ్వడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
తమకు ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వాలని కోరారు. వారం రోజులుగా తమవారి కోసం నిద్రాహారాలు మాని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ, గల్లంతైనవారి ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా ఇప్పటికే కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశామని వివరించారు. కొందరి బోట్లు దగ్గరలో ఉన్నట్టు సమాచారం అందిందన్నారు. అధైర్య పడవద్దని బాధితులను ఓదార్చారు. అనంతరం ఆయా కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు కోడా వెంకట రమణ, తొండంగి సొసైటీ డెరైక్టర్ అంబుజాలపు పెదసత్యనారాయణ తదితరులున్నారు.
అధైర్యపడకండి..
Published Tue, Jun 23 2015 1:48 AM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM
Advertisement
Advertisement