fishermen missing
-
నలుగురు మత్స్యకారుల గల్లంతు
సాక్షి, కాకినాడ: బతుకుతెరువు కోసం బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతైన ఘటన తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో చోటుచేసుకుంది. ఈ నెల 11న ఉప్పాడ శివారు అమీనాబాద్‌కు చెందిన నలుగురు మత్స్యకారులు బోటులో వేటకు వెళ్లారు. తిరిగి వస్తుండగా భైరవపాలెం వద్ద బోటు ఇంజన్ పాడైనట్లు తమ వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆ తర్వాత నుంచి ఫోన్ పనిచేయలేదు. దీంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ ఆదేశాలతో ఇండియన్ కోస్టు గార్డు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. -
కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాలు..!
తిరువనంతపురం: భారీ వర్షాలతో కేరళలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇడుక్కి, కోజికోడ్, వయనాడ్, మలప్పురం, కన్నూర్ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. మణిమలలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఇద్దరు వ్యక్తులు నదిలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచారు. కొల్లాంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో రెడ్అలర్ట్ ప్రకటించారు. గత వందేళ్లలో ఎన్నడూ లేనివిధంగా 2018 చివర్లో కేరళను వరదలు ముంచెత్తి వందలాదిమందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. 159కి చేరిన మృతుల సంఖ్య... భారీ వర్షాలు నేపాల్ నుంచి వస్తున్న వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాలు చిగురుటాకుల్లా వణుకిపోతున్నాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 159 మరణించారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. సహయాక బృందాలు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా బిహార్‌లోనూ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అక్కడ పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వర్షాలు, వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దీనిని జాతీయ విపత్తుగా గుర్తించాలని బిహార్, అసోం ప్రభుత్వాలు కేంద్రాన్ని విఙ్ఞప్తి చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో పంజాబ్, హరియాణాల్లోని నదులు ప్రమాదకరస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. -
జల ప్రళయంలో జాలర్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై/తిరువనంతపురం: ఓక్కి తుపాను కేరళ, తమిళనాడుల్లోని మత్స్యకారకుటుంబాల్లో పెను ప్రళయాన్ని నింపింది. సముద్రంలో వేటకెళ్లిన చాలామంది జాలర్ల జాడ తెలియటం లేదు. దీంతో వీరి కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. ఇప్పటివరకు ఇరురాష్ట్రాల్లో కలసి 513 మంది మత్స్యకారులను కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఒక్క తమిళనాడు నుంచే మరో 400 మంది సముద్రంలో చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. వీరిని కాపాడేందుకు నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్టుగార్డ్ సమన్వయంతో పనిచేస్తున్నాయి. సముద్రంలో ఇంత భయానక పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని ప్రాణాలతో బయటపడ్డవారంటున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పడవలు బోల్తాపడి చాలా మంది గల్లంతయ్యారు. ఆధారం దొరికిన వారు రాకాసి అలల మధ్య తిండీతిప్పల్లేకుండా సాయం కోసం అర్థిస్తూ నిరాశ, నిస్పృహలతో వేచిచూశారు. 60 మందిని జపాన్‌కు చెందిన కార్గోనౌక రక్షించింది. వీరందరినీ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్సనందిస్తున్నా షాక్‌నుంచి ఇంకా తేరుకోలేదని అధికారులు తెలిపారు. మరోవైపు, దక్షిణ తమిళనాడులోని జిల్లాల్లో ఈదురుగాలులు తగ్గినా వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గల్లంతైన వారి జాడ కోసం 8 యుద్ధనౌకలు, 6 విమానాలు, 2 హెలికాప్టర్లు గాలిస్తున్నాయని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేరళలో ఓక్కి ప్రభావంతో మృతిచెందిన వారి సంఖ్య 9కి పెరిగింది. మరోవైపు, ఓక్కి ప్రభావంతో తమిళనాడు, కేరళకు చెందిన 66 బోట్లు మహారాష్ట్ర తీరానికి కొట్టుకొచ్చాయని.. ఇందులోని 952మంది క్షేమంగానే ఉన్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పొంచిఉన్న ‘సాగర్’ ముప్పు దక్షిణ తమిళనాడును వణికించిన ఓక్కి తుపాను తీరందాటగానే ఉత్తర తమిళనాడుకు ‘సాగర్’ తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న మరో వాయుగుండం తుపానుగా మారి ఈనెల 4, 5, 6 తేదీల్లో చెన్నై తీరాన్ని తాకనుందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సమయంలో ఉత్తర తమిళనాడులో భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఓక్కి కారణంగా దక్షిణ తమిళనాడులో వేల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. సాగర్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వణుకుతున్న లక్షద్వీప్ తమిళనాడు, కేరళలను వణికించిన ఓక్కి తుపాను లక్షద్వీప్ ద్వీపాన్నీ అతలాకుతలం చేసింది. ఈదురుగాలుల కారణంగా తీరప్రాంతాల్లోని ఇళ్లన్నీ తీవ్రంగా ధ్వంసమవగా కొబ్బరిచెట్లు కూకటి వేళ్లతో సహా నేలకూలాయి. గాలులతోపాటు భారీ వర్షం కారణంగా లక్షద్వీప్‌లోని దాదాపు అన్ని దీవుల్లో సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మరో 24 గంటలపాటు ఇవే పరిస్థితులు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. 56 ఏళ్ల తర్వాత సహజంగా కన్యాకుమారి సముద్రతీరంలో వాయుగుండం ఏర్పడదు. 1962లో మన్నార్‌వలైకుడాలో ఏర్పడిన వాయుగుండం ధనుష్కోటిని తాకి మొత్తం దక్షిణ తమిళనాడును కుదిపేసి భారీనష్టానికి దారితీసింది. ఇప్పుడు.. 56 ఏళ్ల తరువాత ఓక్కి తుపాను కన్యాకుమారి సహా పలు జిల్లాలను బాధించింది. కాగా, తుపాను నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు సీఎం పళనిస్వామితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితప్రాంతాలు కోలుకునేలా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని మోదీ భరోసా ఇచ్చారు. అటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, నిర్మలా సీతారామన్ కూడా తమిళ ప్రభుత్వానికి అండగా నిలిచారు. -
ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారో!
11 మంది మత్స్యకారుల గల్లంతు వారిలో నలుగురు విశాఖ వాసులు కోస్ట్‌గార్డు గాలింపు చర్యలు మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన కాకినాడ క్రైం : సాంకేతిక కారణాలతో బోట్లు సముద్రంలో ఆగిపోవడంతో 11 మంది మత్స్యకారుల ఆచూకీ నేటికీ తెలియలేదు. సముద్రంలో చిక్కుకున్న వారిలో నలుగురు విశాఖవాసులు కాగా మిగిలిన ఏడుగురు కాకినాడకు చెందినవారే. బోట్లు యజమని మత్స్యశాఖ, కోస్ట్‌గార్డు అధికారులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు ముమ్మరం చేశారు. ఆచూకీ లేకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. రెండు బోట్లు యజమానులు తెలిపిన వివరాలిలావున్నాయి. కాకినాడ పర్లోపేటకు చెందిన పంతాడి కామేశ్వరి, ఆమె భర్త పంతాడి కామేశ్వరరావుకు రెండు బోట్లు ఉన్నాయి. వారికి చెందిన ఇండ్-ఏపీ-ఈ2-ఎంఎం-425 నెంబరుగల మెకనైజ్డ్ బోటులో ఈ నెల 10న ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. బోటు డ్రైవర్ అంగాడి తాతీలు కాకినాడ జగన్నాథపురం ఏటిమొగకు చెందినవాడు కాగా అంగాడి ప్రసాద్, పోలప్పడు, శ్రీను, అప్పారావు, కారె రాము, సీహెచ్ రాజు విశాఖ నుంచి వచ్చారు. కాకినాడ తీరానికి 75 మైళ్ల దూరంలో రెండు రోజుల పాటు వల వేసి ఉంచారు. మూడో రోజు బోటు ప్రొఫైలర్ (అడుగున ఉండే ఫ్యాన్) ఆగిపోవడంతో బోటు నిలిచిపోయింది. గమనించిన మత్స్యకారులు బోటులోనే ఉండిపోయారు. ఏటిమొగకు చెందిన పినపోతు శ్రీను బోటు అటుగా వస్తుండడం గమనించి తమ బోటును ఓడ వద్దకు చేర్చాల్సిందిగా కోరారు. అప్పటికే వారి బోటులో మత్స్యసంపద ఉండడంతో అది సాధ్యం కాదని చెప్పి బోటులో ఉన్న కారె రాము, సీహెచ్ రాజులను తమ బోటులో కాకినాడ తీసుకువచ్చారు. వారు వచ్చి విషయాన్ని బోటు యజమానికి చెప్పడంతో ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారు. సముద్రంలో 25 మైళ్ల వేగంతో గాలి వీస్తుండడంతో బోటు లోతు జలాల్లోకి పోయి ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, పంతాడి కామేశ్వరరావుకు చెందిన ఇండ్-ఏపీ-ఈ3-ఎంఓ-1707 మోటరైజ్డ్ బోటులో ఆరుగురు మత్స్యకారులు ఈ నెల 13 మధ్యాహ్నం వేటకు వెళ్లారు. బోటు వారం లేదా 9 రోజుల్లో తిరిగి రావాల్సి ఉంది. ఇప్పటి వరకూ దాని ఆచూకీ తెలియకపోవడంతో యజమాని, మత్స్యకారుల కుటుంబ సభ్యులు సందిగ్ధంలో పడ్డారు. దీనిపై కూడా అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. బోటులో కాకినాడ దుమ్ములపేటకు చెందిన పి. అప్పారావు, పర్లోపేటకు చెందిన ఎం. సత్తిబాబు, సీహెచ్ చిన్నప్ప (పరశురామ్), సీహెచ్ రాజయ్య, ఏటిమొగకు చెందిన డి. అంజిబాబు, పి.వెంకటేశ్వర్లు చిక్కుకుపోయారు. రెండు బోట్లు సముద్రంలో చిక్కుకుపోవడంతో పర్లోపేట, దుమ్ములపేట, ఏటిమొగల్లో ఆందోళన నెలకొంది. అటుగా వస్తున్న ఓడలు, బోట్లు గమనించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. -
అధైర్యపడకండి..
తొండంగి :సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సోమవారం పరామర్శించారు. తీరంలోని ఎల్లయ్యపేట, హకుంపేట తదితర గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి పర్యటించారు. ఎల్లయ్యపేటలో చొక్కా రాజు, కోడా సత్యనారాయణ, మడదా మహేశ్వరరావు, చింతకాయల కాశీరావు, సిరిపిన గోవిందు, దైలపల్లి రాజు తదితరుల కుటుంబాలను.. హుకుంపేటలో బోటు యజమానులు పెరుమాళ్ల పెదకోదండం, సూరాడ మసేనులతోపాటు 23 మత్స్యకార కుటుంబాలను ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాల మహిళలు మాట్లాడుతూ, గల్లంతైన తమవారికి సంబంధించి ఏ ఒక్క అధికారీ సమాచారం ఇవ్వడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తమకు ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వాలని కోరారు. వారం రోజులుగా తమవారి కోసం నిద్రాహారాలు మాని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ, గల్లంతైనవారి ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా ఇప్పటికే కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశామని వివరించారు. కొందరి బోట్లు దగ్గరలో ఉన్నట్టు సమాచారం అందిందన్నారు. అధైర్య పడవద్దని బాధితులను ఓదార్చారు. అనంతరం ఆయా కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు కోడా వెంకట రమణ, తొండంగి సొసైటీ డెరైక్టర్ అంబుజాలపు పెదసత్యనారాయణ తదితరులున్నారు.