11 మంది మత్స్యకారుల గల్లంతు
వారిలో నలుగురు విశాఖ వాసులు
కోస్ట్‌గార్డు గాలింపు చర్యలు
మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన
కాకినాడ క్రైం : సాంకేతిక కారణాలతో బోట్లు సముద్రంలో ఆగిపోవడంతో 11 మంది మత్స్యకారుల ఆచూకీ నేటికీ తెలియలేదు. సముద్రంలో చిక్కుకున్న వారిలో నలుగురు విశాఖవాసులు కాగా మిగిలిన ఏడుగురు కాకినాడకు చెందినవారే. బోట్లు యజమని మత్స్యశాఖ, కోస్ట్‌గార్డు అధికారులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు ముమ్మరం చేశారు. ఆచూకీ లేకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. రెండు బోట్లు యజమానులు తెలిపిన వివరాలిలావున్నాయి. కాకినాడ పర్లోపేటకు చెందిన పంతాడి కామేశ్వరి, ఆమె భర్త పంతాడి కామేశ్వరరావుకు రెండు బోట్లు ఉన్నాయి.
వారికి చెందిన ఇండ్-ఏపీ-ఈ2-ఎంఎం-425 నెంబరుగల మెకనైజ్డ్ బోటులో ఈ నెల 10న ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. బోటు డ్రైవర్ అంగాడి తాతీలు కాకినాడ జగన్నాథపురం ఏటిమొగకు చెందినవాడు కాగా అంగాడి ప్రసాద్, పోలప్పడు, శ్రీను, అప్పారావు, కారె రాము, సీహెచ్ రాజు విశాఖ నుంచి వచ్చారు. కాకినాడ తీరానికి 75 మైళ్ల దూరంలో రెండు రోజుల పాటు వల వేసి ఉంచారు. మూడో రోజు బోటు ప్రొఫైలర్ (అడుగున ఉండే ఫ్యాన్) ఆగిపోవడంతో బోటు నిలిచిపోయింది. గమనించిన మత్స్యకారులు బోటులోనే ఉండిపోయారు.
ఏటిమొగకు చెందిన పినపోతు శ్రీను బోటు అటుగా వస్తుండడం గమనించి తమ బోటును ఓడ వద్దకు చేర్చాల్సిందిగా కోరారు. అప్పటికే వారి బోటులో మత్స్యసంపద ఉండడంతో అది సాధ్యం కాదని చెప్పి బోటులో ఉన్న కారె రాము, సీహెచ్ రాజులను తమ బోటులో కాకినాడ తీసుకువచ్చారు. వారు వచ్చి విషయాన్ని బోటు యజమానికి చెప్పడంతో ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారు. సముద్రంలో 25 మైళ్ల వేగంతో గాలి వీస్తుండడంతో బోటు లోతు జలాల్లోకి పోయి ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, పంతాడి కామేశ్వరరావుకు చెందిన ఇండ్-ఏపీ-ఈ3-ఎంఓ-1707 మోటరైజ్డ్ బోటులో ఆరుగురు మత్స్యకారులు ఈ నెల 13 మధ్యాహ్నం వేటకు వెళ్లారు.
బోటు వారం లేదా 9 రోజుల్లో తిరిగి రావాల్సి ఉంది. ఇప్పటి వరకూ దాని ఆచూకీ తెలియకపోవడంతో యజమాని, మత్స్యకారుల కుటుంబ సభ్యులు సందిగ్ధంలో పడ్డారు. దీనిపై కూడా అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. బోటులో కాకినాడ దుమ్ములపేటకు చెందిన పి. అప్పారావు, పర్లోపేటకు చెందిన ఎం. సత్తిబాబు, సీహెచ్ చిన్నప్ప (పరశురామ్), సీహెచ్ రాజయ్య, ఏటిమొగకు చెందిన డి. అంజిబాబు, పి.వెంకటేశ్వర్లు చిక్కుకుపోయారు. రెండు బోట్లు సముద్రంలో చిక్కుకుపోవడంతో పర్లోపేట, దుమ్ములపేట, ఏటిమొగల్లో ఆందోళన నెలకొంది. అటుగా వస్తున్న ఓడలు, బోట్లు గమనించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.
ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారో!
Published Fri, Dec 25 2015 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM
Advertisement