పక్కలో మరో బల్లెం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇప్పటికే సొంతపార్టీ నేతల చర్యలతో అభద్రతా భావంతో సతమతమవుతున్నారు. ఇకపై మిత్రపక్షం బీజేపీ నుంచి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఇందుకు బీజేపీలో చేరాలనుకుంటున్న కాంగ్రెస్ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఇందుకూరి రఘురాజే కారణం. ఆయన బీజేపీలో చేరితే అక్కడ మరో పవర్ సెంటర్ తయారవుతుందని భయపడుతున్నారు. అందుకనే ముందుజాగ్రత్తగా బీజేపీ అగ్రనేతలపై ఒత్తిడికి దిగారు. రాజకీయంగా విభేదిస్తున్న రఘురాజును చేర్చుకుంటే తనకు ఇబ్బంది వస్తుందని పరోక్షంగా తెలిపారు. కానీ కోళ్ల లలితకుమారి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కొన్ని రోజుల పాటు సందిగ్ధంలో పడ్డ బీజేపీ అగ్రనేతలు చివరికి రఘురాజును చేర్చుకోవడానికే మొగ్గుచూపారు. ఎస్‌కోటలో పార్టీ బలపడాలనే వ్యూహంతో పావులు కదుపుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కుమార్తె శోభా స్వాతి రాణి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన దగ్గరి నుంచి ఎస్‌కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అభద్రతా భావంలో పడ్డారు. జెడ్పీ పదవితో నియోజకవర్గంలో హైమావతి పట్టు పెంచుకుంటారని, తనకు పోటీగా తయారవుతారని, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌కు ఎసరొచ్చే అవకాశం ఉందనే భయపడుతున్నట్టు తెలిసింది. శోభా హైమావతి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారన్న వాదనలు ఉన్నాయి. ఈ తరుణంలో ఇందుకూరి రఘురాజు రూపంలో మరో ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవల్సిన పరిస్థితి ఆమెకు ఏర్పడింది. బీజేపీలో చేరుతానని రఘురాజు ప్రకటించిన రోజు నుంచి ఆమెవర్గీయుల్లో ఆందోళన మొదలైంది.
విశాఖ పార్లమెంట్ పరిధిలోకి ఎస్‌కోట అసెంబ్లీ నియోజకవర్గం వస్తుందని, రఘరాజు బీజేపీలో చేరితే కంభంపాటి హరిబాబుకు చెందిన ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు తెచ్చి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తమకు సమాంతరంగా ఎదిగిపోతారని ఆమె అనుచరులు భయాందోళన వ్యక్తం చేసినట్టు తెలి సింది. దీంతో కోళ్ల లలితకుమారి అప్రమత్తమై రఘురాజును చేర్చుకోనివ్వద్దని మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు ద్వారా ఎంపీ కంభంపాటి హరిబాబుపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అంతటితో ఆగకుండా టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న కా మినేని శ్రీనివాసరావుపై కూడా ఒత్తిళ్లకు దిగినట్టు తెలియవచ్చింది. రఘరాజు బీజేపీలో చేరితే ఆయనతో పాటు ఆయన గురువులుగా ఉన్న కాంగ్రెస్ కీలక నేతలు కూడా చేరవచ్చని అదేజరిగితే భవిష్యత్‌లో టీడీపీకికూడా ఇబ్బందులొస్తాయం టూ మంత్రులకు చెప్పి తద్వారా బీజేపీపై ఒత్తిడి చేశారని నియోజకవర్గంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు ఈ విషయంపై నిర్ణయం తీసుకోని బీజేపీ చివరికి ఒక ఆలోచనకొచ్చింది.
రాష్ట్రంలో పటిష్టమవుదామని వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న బీజేపీ అగ్రనేతలు, వచ్చిన అవకాశాన్ని వదులకోకూడదని, పార్టీ బలోపేతం అయ్యేందుకు దోహదపడే పరి ణామాలను సద్వినియోగం చేసుకోవాలన్న యోచనతో రఘురాజును చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే కేంద్రమంతి వెంకయ్యనాయుడు, తదితర పెద్దల సమక్షంలో చేర్చుకునేందుకు రఘరాజుకు సంకేతాలు ఇచ్చా రు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇక రఘురాజు బీజేపీలో చేరితే నియోజకవర్గంలో తిష్ఠవేయడమే కాకుండా ఎంపీ ల్యాడ్స్, కేంద్రప్రభుత్వ నిధులతో పనులు చేయించి ఎమ్మెల్యేకు పోటీగా తయారయ్యే అవకాశం ఉంది. చెప్పాలంటే మరో పవర్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే శోభా హైమావతి రూపంలో ఒక సవాల్ ఎదుర్కొంటుండగా ఇకపై రఘురాజు ద్వారా మరో సవాల్ ఎదుర్కోవల్సిన పరిస్థితి ఏర్పడనుంది.