
పార్టీలో తిరిగి చేర్చుకొనే ఉద్దేశం లేదు: రోజా
తిరుపతి: తెలుగుదేశం మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. టీడీపీ మంత్రుల వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. మంత్రులనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ టీడీపీ నేతలపై ఆమె నిప్పులు చెరిగారు. నందిగామ ఎమ్మెల్యే చనిపోతే వైఎస్‌ఆర్ సీపీ పోటీపెట్టలేదని తెలిపారు. నైతికత గురించి మాట్లాడే టీడీపీ నేతలు నంద్యాలలో వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే మరణిస్తే మాత్రం ఎందుకు పోటీపెడుతున్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం నేతలకు నైతికత, సంప్రదాయాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మరణించిన భూమా నాగిరెడ్డి ఏ పార్టీ ఎమ్మెల్యేనో స్పీకర్ కోడెలను అడిగితే ఆయనే చెప్తారని పేర్కొన్నారు.
వైఎస్‌ఆర్ సీపీ నేతలకు నీతులు చెప్పే సోమిరెడ్డి, 21 మంది ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి నీతుల మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. పదవుల కోసం తల్లిలాంటి పార్టీని మారిన చరిత్ర ఆదినారాయణ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డిలదని విమర్శించారు. అచ్చెన్నాయుడు మనిషి పెరిగాడు కానీ బుర్ర పెరగలేదని ఎద్దేవా చేశారు. తనకు అనుకూలంగా లేని 120 మంది కళింగ ఉద్యోగులను కక్షపూరితంగా పలు ప్రాంతాలకు బదిలీ చేయించిన వ్యక్తి అచ్చెన్నాయుడు అని విమర్శించారు. కులాల పేరుతో రాజకీయాలు చేసేది చంద్రబాబేనని మండిపడ్డారు. అధికారం కోసం 32కులాల మధ్య చిచ్చుపెట్టారని విమర్శంచారు. కులం చూసే ఏపీ డీజీపీ సాంబశివరావుకు పూర్తి స్థాయిలో అధికారాలు, బాధ్యతలు అప్పగించలేదన్నారు.
ఆగస్టు మూడో తేదీ నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాలలో పర్యటిస్తారని తెలిపారు. టీడీపీ నేతలు చేసే ప్రతి మాటకు సమాధానం చెబుతారన్నారు. నంద్యాల ప్రజలు తెలుగుదేశం నాయకుల డ్రామాలను గమనిస్తున్నారని, ఉప ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. పార్టీ మారిన నేతలను తిరిగి పార్టీలో చేర్చుకొనే ఉద్దేశం అధినేతకు లేదని, పార్టీ మారిన నేతలు తిరగి వస్తామని అడిగినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించలేదని తెలిపారు.